సర్కారు ఆర్థిక ఎదురీత! | Government economic ! | Sakshi
Sakshi News home page

సర్కారు ఆర్థిక ఎదురీత!

Published Fri, Jul 15 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

సర్కారు ఆర్థిక ఎదురీత!

సర్కారు ఆర్థిక ఎదురీత!

* ఆదాయ వృద్ధిని మించిన ఖర్చులు
* ఇరిగేషన్‌కు ఈ నెలలో బిల్లుల చెల్లింపు వాయిదా
* అత్యవసరమైతేనే మిగతా బిల్లులివ్వాలని ట్రెజరీలకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలో మాత్రం ఆర్థికంగా ఎదురీదుతోంది. ఖర్చులన్నీ ఒక్కసారిగా ముంచుకురావటంతో గడ్డు కాలాన్ని చవిచూస్తోంది.

ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఉద్యోగుల జీతాలు మినహా ఇతరత్రా బిల్లుల చెల్లింపులన్నీ నిలిపివేసింది. ఈ మేరకు అన్ని ట్రెజరీ కార్యాలయాలకు ఆర్థికశాఖ మౌఖిక అదేశాలు జారీ చేసింది. జీతాలు మినహా బిల్లులేవీ విడుదల చేయొద్దని ఆంక్షలు విధించింది. రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడతగా ఇవ్వాల్సిన రూ. 4,040 కోట్లలో రూ. 2,020 కోట్లను ఇటీవలే విడుదల చేసిన ప్రభుత్వం మిగతా సగం నిధులను ఈ నెలాఖరున చెల్లించాల్సి ఉంది.

దీంతో రుణమాఫీకి సరిపడా నిధులను సర్దుబాటు చేయడాన్ని ఈ నెలలో ఆర్థికశాఖ మొదటి ప్రాధాన్యంగా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే నీటిపారుదలశాఖ పరిధిలో ఈ నెలలో ఇవ్వాల్సిన బిల్లులను నిలిపివేసింది. ఈ ఏడాది బడ్జెట్‌లో నీటిపారుదలశాఖకు రూ. 25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం...ప్రాజెక్టుల పనులన్నీ వేగంగా చేపట్టేందుకు ఈ శాఖకు ప్రతి నెలా రూ. 2,000 కోట్లు చెల్లిస్తోంది. తొలి మూడు నెలలు నిధులు విడుదల చేసిన ఆర్థికశాఖ ప్రస్తుత ఇక్కట్ల దృష్ట్యా జూలై కోటాను విడుదల చేయలేదు. దీంతో ప్రాజెక్టుల పరిధిలో బిల్లుల చెల్లింపులు ఆగిపోయాయి. కొన్ని బిల్లుల చెల్లింపు ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని, వెంటనే చెల్లించాల్సిన బిల్లులు వారం వాయిదాపడే అవకాశాలున్నాయని సంబంధిత అధికారులు
 చెబుతున్నారు.
 
ఆదాయం పెరిగినా ఖర్చులెక్కువ
గతేడాదితో పోలిస్తే రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 24 శాతానికిపైగా వృద్ధి చెందింది. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కమర్షియల్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సేల్స్, ట్రాన్స్‌పోర్ట్, గనులు తదితర శాఖల ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 10 వేల కోట్లకుపైగా ఆదాయం వచ్చింది. తొలి రెండు నెలల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ ద్వారా వచ్చిన ఆదాయం నిరుటి కంటే 64 శాతం పెరిగింది. ఎక్సైజ్ శాఖలో 120 శాతం ఆదాయం పెరిగింది. లగ్జరీ టాక్స్‌ల ద్వారా వచ్చే ఆదాయం 36 శాతం, అమ్మకపు పన్ను ద్వారా వచ్చిన ఆదాయం 17 శాతం పెరిగింది. అయితే ఈ నెల అంతకుమించి ఖర్చులుండటంతో నిధుల కటకట తలెత్తింది.

సగటున ప్రతి నెలా రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం రూ. 4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్లకు మించదు. కానీ రూ. 5,000 కోట్లకు మించి ఈ నెల చెల్లింపులు చేయాల్సి ఉండటంతో సమస్య తలెత్తిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో చేపట్టిన కార్యక్రమాలతోపాటు రైతుల రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు చెల్లింపులు, విద్యుత్, బియ్యం సబ్సిడీలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బిల్లులన్నీ ఏకకాలంలో చుట్టుముట్టాయి. దీనికితోడు ప్రభుత్వ భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా వస్తుందనుకున్న ఆదాయం సమకూరకపోవటం ప్రతికూలంగా మారింది.
 
పెండింగ్‌లోనే ఇన్‌పుట్ సబ్సిడీ
జూన్‌లోనే మూడో విడత రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు సమకూర్చటం అనివార్యం కావటంతో ముందుగా ఈ నిధులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడింది. అందుకే ఖరీఫ్ సమయం ముంచుకొచ్చినా కరువు మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీని సైతం పెండింగ్‌లో పెట్టింది. ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. 820 కోట్లు విడుదల చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో రూ. 198 కోట్లు జత చేయాల్సి ఉంది.  కానీ నిధుల కటకటతోనే ఇప్పటికీ చెల్లింపులు చేయలేదు.

ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్లకు ఈ నెలలో పెంచాల్సిన డీఏ, తొమ్మిది నెలల పీఆర్‌సీ బకాయిలను ప్రభుత్వం ఇప్పటికీ పెండింగ్‌లో పెట్టింది. సర్వర్ డౌన్ పేరుతో దాదాపు రూ. 3,000 కోట్లకుపైగా బిల్లులు ఆపేసినట్లు వివిధ శాఖల అధికారులు చెబుతున్నారు. మరోవైపు సెర్ప్ ఉద్యోగుల జీతాలకు ఆసరా పెన్షన్లు, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం పథకాలకు వినియోగించే నిధులను దారి మళ్లించి వేతనాలు సర్దుబాటు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement