పీజీ వైద్య ఫీజుల పెంపునకు సర్కారు ఓకే! | Government says ok to PG medical fees hike | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య ఫీజుల పెంపునకు సర్కారు ఓకే!

Published Tue, May 2 2017 2:20 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

పీజీ వైద్య ఫీజుల పెంపునకు సర్కారు ఓకే! - Sakshi

పీజీ వైద్య ఫీజుల పెంపునకు సర్కారు ఓకే!

- ప్రైవేటు కాలేజీల విన్నపాన్ని ఏఎఫ్‌ఆర్సీకి పంపిన వైద్యారోగ్యశాఖ
- ఎంతెంత పెంచాలన్న దానిపై లేఖ తీసుకురమ్మని కాలేజీలకు సూచన


సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని పీజీ వైద్య సీట్ల ఫీజు పెంపునకు సర్కారు పచ్చజెండా ఊపింది. ఫీజుల పెంపునకు సంబంధించి ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఇచ్చిన వినతిపత్రాన్ని ‘అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేషన్‌ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ)’కి పంపించింది. మరోవైపు ఫీజులు ఎంతెంత పెంచాలన్న దానిపై స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని ప్రైవేటు కాలేజీలకు సూచించింది. వాటిని కూడా ఏఎఫ్‌ఆర్సీకి పంపించి తుది నిర్ణయం తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి.

సీట్లను మార్చండి
పీజీ వైద్య ఫీజులను పెంచకుంటే ఆయా సీట్లన్నింటినీ తాము ఉపసంహరించుకుంటామని రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కన్వీనర్‌ కోటాలోని 50 శాతం సీట్లుపోగా.. మిగతా సీట్లలో 25 శాతం బీ కేటగిరీగా, మరో 25 శాతం ఎన్నారై కోటా సీట్లుగా మార్చాలని డిమాండ్‌ చేశాయి. కన్వీనర్‌ కోటా, బీ కేటగిరీ సీట్లను ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా భర్తీ చేయాలని, ఎన్నారై కోటా సీట్లను సొంతంగా భర్తీ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరాయి. అన్ని రకాల ఫీజులను పెంచాలని కోరాయి. ప్రస్తుతం క్లినికల్‌ కన్వీనర్‌ కోటా సీటుకు రూ.3.2 లక్షల ఫీజు ఉండగా.. రూ.12 లక్షలకు పెంచాలని డిమాండ్‌ చేశాయి. యాజమాన్య కోటా సీట్లకు ఫీజు రూ.5.8 లక్షలుగా ఉండగా.. వాటిని విభజించి బీ కేటగిరీ సీట్లకు రూ.25 లక్షలకు, ఎన్నారై కోటా సీట్లకు రూ.50 నుంచి 60 లక్షల వరకు పెంచాలని డిమాండ్‌ చేశాయి. అయితే ఈ ఫీజుల విషయంలో ప్రైవేటు కాలేజీల మధ్య ఏకాభిప్రాయం లేనందున పూర్తి స్పష్టతతో రావాలని సర్కారు సూచించినట్లు తెలిసింది.

ఉమ్మడి కౌన్సెలింగ్‌పై సుప్రీంకు..
రాష్ట్రంలోని 8 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో 460 క్లినికల్‌ పీజీ సీట్లు, 138 నాన్‌ క్లినికల్‌ సీట్లు ఉన్నాయి. క్లినికల్‌ సీట్లకు విద్యార్థుల నుంచి డిమాండ్‌ ఎక్కువ. ప్రస్తుతం 460 క్లినికల్‌ సీట్లలో 50 శాతం (230 సీట్లు) కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తుండగా.. మిగతా 230 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకుంటున్నాయి. ఇందుకోసం భారీగా ఫీజులు వసూలు చేసుకుంటున్నాయి. అయితే నీట్‌ ర్యాంకుల నేపథ్యంలో ఈసారి నుంచి ఉమ్మడి కౌన్సెలింగ్‌కు సర్కారు ఏర్పాట్లు చేస్తుండటంతో మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు కంగుతిన్నాయి. పీజీ వైద్య సీట్ల అడ్మిషన్లకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ వద్దని, యాజమాన్య సీట్లను సొంతంగా భర్తీ చేసుకుంటామని పట్టుబట్టాయి. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నందున తామేమీ చేయలేమని, ఉమ్మడి కౌన్సెలింగ్‌కు అంగీకరించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement