లక్ష్యం 39.36 కోట్ల మొక్కలు
- హరితహారంలో ఈ ఏడాది
- 4,213 న ర్సరీల్లో మొక్కల పెంపకం
- శాఖలవారీగా డిమాండ్‌ను తెలియజేస్తూ నివేదిక
సాక్షి, హైదరాబాద్: ‘హరితహారం’ రెండో ఏడాదికి సంబంధించిన ప్రణాళిక సిద్ధమైంది. ఈ సంవత్సరం(2016)లో రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 39.36 కోట్ల మొక్కలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసిన 2015లో ఏటా 40 కోట్ల మొక్కల చొప్పున మూడేళ్లలో 120 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆయా శాఖలకు నిర్దేశించింది. గత ఏడాది వర్షాభావ పరిస్థితులు, శాఖల మధ్య సమన్వయలోపం వల్ల 15 కోట్ల మొక్కలే నాటినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో రెండో ఏడాది లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలిచ్చింది. జూన్‌లో వర్షాకాలం మొదలైనప్పటి నుంచే గ్రామాలు, పట్టణాల్లో మొక్కలు నాటేందుకు సన్నాహాలు మొదలుపెట్టిం ది. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీతోపాటు పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, డ్వామా, నీటిపారుదల శాఖ, రెవెన్యూ తదితర విభాగాలు, జిల్లా పరిషత్, ఇతర స్థానిక సంస్థలకు చెందిన 4213 నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని ఉద్యమం మాదిరి చేపడుతున్నట్లు అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పండ్ల మొక్కలకు డిమాండ్ పెరగడంతో ఉద్యానవనశాఖపై అధికభారం పడనుంది. అయితే ఈ సంవత్సరం 23 లక్షల పండ్ల మొక్కలను మాత్రమే తాము అందించగలమని ఆ శాఖ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
ఆబ్కారీ శాఖ కోసం 70 లక్షల ఈత, తాటి మొక్కలను పెంచుతున్నారు. గత సంవత్సరం తెలంగాణ హరితహారం ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మొక్కల సంరక్షణ బాధ్యతను ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వర్షాభావ పరిస్థితులతోపాటు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా హరితహారం తొలి ఏడాది లక్ష్యం నెరవేరలేదు. నాటిన మొక్కల్లో 50 శాతం కూడా మనలేదని క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఇక చెరువులు, కుంటలు ఎండిపోయి బోర్లలో కూడా నీళ్లులేని పరిస్థితుల్లో మిగిలిన మొక్కలు కూడా వచ్చే వేసవికాలంలో ఎంతమేరకు మిగులుతాయన్నది ప్రశ్నే!
హరితహారం ప్రాజెక్టు హైలైట్స్...
- 2015 నుంచి 2017 వరకు రాష్ట్రంలో నాటాల్సిన మొక్కలు: 230 కోట్లు
- మైదాన ప్రాంతాలు: 120 కోట్లు,
- అటవీశాఖ పరిధిలోని ఖాళీ ప్రదేశాలు: 100 కోట్లు,
- హెచ్‌ఎండీఏ: 10 కోట్లు
- ప్రతి నియోజకవర్గం: 40 లక్షలు
- గ్రామ పంచాయతీ: 40వేలు
- మొక్కలు నాటే విస్తీర్ణం: 27 లక్షల హెక్టార్లు
- 2015లో మైదాన ప్రాంతంలో నాటాల్సిన మొక్కలు:
- 40 కోట్లు. ఇప్పటివరకు నాటిన మొక్కలు: 15 కోట్లు
- 2016లో నాటాల్సిన మొక్కలు: 39.36 కోట్లు