గ్రేటర్ ఆస్తులు గల్లంతు
లెక్కాపత్రమేదీ..
=జీహెచ్‌ఎంసీ నిర్వాకం
=మొత్తం ఆస్తులు దాదాపు 1500
=రికార్డులున్నవి 104 మాత్రమే..
=సాంకేతిక పరిజ్ఞానం వినియోగమేదీ?
సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల నుంచి ఆస్తిపన్ను వసూలుకు జల్లెడ వేసి గాలిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్.. తన సొంత ఆస్తులు ఎన్ని ఉన్నాయనేది మాత్రం లెక్కాపత్రం లేకుండా వ్యవహరిస్తోంది. ఆధునిక సాంకేతికత, ఓఎస్సార్టీ తదితర విధానాల ద్వారా ఏ వీధిలో రోడ్లను ఎప్పుడు ఊడ్చారో, ఏ చెత్త డబ్బా నుంచి చెత్తను తరలించలేదో తెలుసుకోగలుగుతున్న జీహెచ్‌ఎంసీ యంత్రాంగానికి సొంత ఆస్తులెన్నున్నాయో మాత్రం తెలియదు.
ఆయా ఆస్తుల్లో ఎవరుంటున్నారు? ఎంతకాలంగా ఉంటున్నారు? అం దుకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారనే వివరాలేం లేవు. ఆస్తిపన్ను వసూళ్లకు ఎక్కడెన్ని భవనాలున్నాయి?, ప్లింత్ ఏరియాలకు సంబంధించి వాస్తవ లెక్కలకు.. రికార్డుల్లోని లెక్కలకు తేడాలున్నాయా? తదితర విషయాల కోసం క్షేత్రస్థాయి సిబ్బందినే కాక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నీ వినియోగించుకుంటోన్న గ్రేటర్ యంత్రాంగానికి తన ఆస్తుల్లో ఎన్ని ఖాళీ స్థలాలున్నాయో, పార్కు స్థలాలెన్ని ఉన్నాయో మాత్రం లెక్క చెప్పలేకపోతోంది. వాటికి సంబంధించి కనీసం రికార్డులు కూడా లేవు. తెలిసిన ఆస్తుల్లోనూ ఏ సముదాయాల్లో ఎవరుంటున్నారో తెలియదు. దీంతో, కోట్ల రూపాయల మేర ఆదాయానికి గండి పడుతోంది.
వీటిని గుర్తించేందుకు గతంలో ఒకటి రెండు ప్రయత్నాలు జరిగినా.. వాటిపై చొరవ చూపిన అధికారులు బదిలీలపై వెళ్లిపోవడంతో కార్యక్రమం అటకెక్కింది. తిరిగి మళ్లీ వీటిపై దృష్టి సారిం చారు. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన ఆస్తుల వివరాలు ఎస్టేట్స్ విభాగంలో లేకపోవడంతో.. మాయమైన ఆస్తులను గుర్తించే సంగతి అటుంచి.. ఉన్న ఆస్తులనైనా కాపాడుకునేందుకు డే టాబేస్ అవసరమని భావించి ప్రస్తుతం ఆ పనిలో పడ్డారు. దీనినైనా పూర్తి చేస్తారో లేక మధ్యలోనే నిలిపివేస్తారో?!.
ఆస్తులు బోలెడు.. వివరాల్లేవ్
నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీకి అత్యంత విలువైన ఆస్తులెన్నో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, రికార్డులు గల్లంతు తదితర కారణాల వల్ల జీహెచ్‌ఎంసీ వద్ద ప్రస్తుతం ఆ వివరాల్లేవు. గతంలో ఈ దిశగా కొంత కసరత్తు చేసిన అధికారులు నానా తంటాలు పడి 272 ఆస్తులు లీజులో ఉన్నట్లు గుర్తించారు. వాటిలోనూ 104 ఆస్తులకు సంబంధించిన సమాచారమే రికార్డుల్లో ఉంది.
ఆ రికార్డుల మేరకు 104 ఆస్తులు లక్షా 20 వేల చదరపు గజాల స్థలంలో ఉన్నాయి. మిగతా వాటి వివరాల్లేవు. వాస్తవంగా ఇప్పుడవి ఎవరి అజమాయిషీలో ఉన్నాయో, ఏ అవసరాలకు వినియోగిస్తున్నారో కూడా తెలియదు. జీహెచ్‌ఎంసీ వర్గాల అంచనాల మేరకే జీహెచ్‌ఎంసీకి సంబంధించిన ఆస్తులు 1500 దాకా ఉంటాయి. కానీ అవెక్కడున్నాయో, ఎవరి అధీనంలో ఉన్నాయో వివరాల్లేకపోవడంతో వాటి ఉనికిని కనుక్కొనే ఆలోచన ఉన్నప్పటికీ.. దాని కంటే ముందు అందుబాటులో ఉన్న ఆస్తుల వివరాలతో డేటాబేస్ రూపొందించాలని భావిస్తున్నామని అడిషనల్ కమిషనర్ (ఎస్టేట్స్, కోఆర్డినేషన్) వెంకటరామిరెడ్డి తెలిపారు.
లేని పక్షంలో ఇవి సైతం క్రమేపీ గల్లంతయ్యే ప్రమాదం ఉందని, ప్రస్తుతం వివరాలున్న ఆస్తులకు సంబంధించిన డేటాబేస్ రూపొందించనున్నట్లు తెలిపారు. తద్వారా ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండటమే కాక, వాటి ద్వారా రావాల్సిన ఆదాయాన్ని ఎప్పడికప్పుడు రాబట్టుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. తద్వారా జీహెచ్‌ఎంసీ ఖజానాకు ఎంతో కొంత ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నారు.