
గ్రేటర్‌కు రూ.52 వేల కోట్లు
బ్రిక్స్ బ్యాంక్‌కు రుణ ప్రతిపాదనలు
♦ కౌంటర్ మాగ్నెట్ సిటీలుగా 11 పట్టణాలు
♦ మూసీపై 42 కి.మీ. ఈస్ట్ టు వెస్ట్ కారిడార్
♦ ప్రతిపాదనలు సిద్ధం చేయండి: సీఎస్ రాజీవ్‌శర్మ ఆదేశాలు
♦ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులతో సమీక్ష
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసింది. మూసీ నదిపై ఈస్ట్ టు వెస్ట్ కారిడార్, నగరం చుట్టూరా ఉన్న 11 పట్టణాలను కౌంటర్ మాగ్నెట్ సిటీలుగా అభివృద్ధి చేసే వినూత్న ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. వీటితోపాటు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు, 40 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే తాగునీటి జలాశయాలకు అవసరమైన నిధుల సమీకరణపై దృష్టి సారించింది. బహుళ ప్రయోజనకరంగా ఉండే ఈ ప్రాజెక్టులకు బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ. 52 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రుణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు.
వరల్డ్ బ్యాంక్‌కు ప్రత్యామ్నాయంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కొత్తగా నెలకొల్పిన న్యూ డెవలప్‌మెంట్ బ్రిక్స్ బ్యాంక్ ఏప్రిల్ నుంచి రుణ పంపిణీ కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో ముందుగా అందిన ప్రతిపాదనలకు రుణాల్లో ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి. అందుకే ప్రభుత్వం ముందు వరుసలో ఉండేందుకు సన్నద్ధమైంది. నెల రోజుల్లో ప్రతిపాదలను బ్యాంక్‌కు పంపేందుకు సన్నాహాలు ప్రారంభించింది. దీనికి సంబంధించి సచివాలయంలో పురపాలక శాఖ, హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో సీఎస్ సోమవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
బ్రిక్స్ రుణం మొత్తం సిటీకే..
బ్రిక్స్ బ్యాంక్ నుంచి రూ.25 వేల కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వం తొలుత అంచనాలు వేసింది. కానీ నగర పరిధిలో ప్రతిపాదనలో ఉన్న కొత్త ప్రాజెక్టులు, వాటికయ్యే అంచనా వ్యయాలను పరిశీలించి రూ.52 వేల కోట్ల సాయం కోరాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని రహదారులు, ఫ్లైఓ వర్లు, మల్టీగ్రేడ్ సెపరేటర్ల నిర్మాణానికి చేపట్టిన స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు రూ.25 వేల కోట్లు, మూసీ నదీ సుందరీకరణ కు రూ.10 వేల కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.7 వేల కోట్లు, తాగునీటి సమస్యకు పరిష్కారంగా శివార్లలో 40 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన రిజర్వాయర్లు, పైపులైన్లకు రూ.10 వేల కోట్లు కావాలని అధికారులు నివేదికలు సమర్పించారు. వీటిపై 3 వారాల్లో నివేదికలను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. బ్రిక్స్ నుంచి ఆశిస్తు న్న రుణాన్ని మొత్తం గ్రేటర్ ప్రాజెక్టులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రాష్ట్రం లోని మిగతా కార్పొరేషన్లకు రూ.8 వేల కోట్లు రుణం కోరాలనే ప్రతిపాదనను విరమించుకుంది.
అధునాతనంగా ప్రాజెక్టులు
హైదరాబాద్‌ను విశ్వనగరాలకు పోటీగా నిలబెట్టేందుకు స్ట్రాటెజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ నగర పరిధిలో రహదారుల అభివృద్ధికి రూ.15 వేల కోట్లు, నగరం చుట్టూ ఉన్న 11 పట్టణాలను ‘కౌంటర్ మాగ్నెట్ సిటీ డెవలప్‌మెంట్’ కిందకు తెచ్చే ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నగరం చుట్టూ ఉన్న సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, నాచారం, శంకర్‌పల్లి, మహేశ్వరం, షాద్‌నగర్, వికారాబాద్ పట్టణాలను ఇందులో చేర్చారు.
ఈ పట్టణాలకు హైదరాబాద్‌కు మధ్య రాకపోకల సమయాన్ని వీలైనంత మేరకు తగ్గిస్తే, సిటీలో పనిచేస్తున్న ఉద్యోగ, వ్యాపార వర్గాలు ఈ పట్టణాల్లోనూ నివాసమేర్పరుచుకునే అవకాశాలు మెరుగుపడుతాయి. దీంతో గ్రేటర్ చుట్టూరా ఉన్న పట్టణాలు సైతం సిటీని తలదన్నేలా వృద్ధి చెందుతాయనేది ప్రభుత్వ వ్యూహం. అందుకే అధునాతన రహదారులు నిర్మిస్తారు. మరోవైపు మూసీ నదికి ఇరువైపులా ఆరు లేన్ల రహదారి నిర్మించాలని, మూసీ ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ పేరుతో కొత్త ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. నార్సింగి నుంచి ఉప్పల్ వరకు దాదాపు 42 కి.మీ. రహదారి నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తోంది.