నేటి నుంచే పచ్చని పండుగ
- నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో రెండో విడత హరితహారాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
- రెండు వారాల పాటు కార్యక్రమం.. 46 కోట్ల మొక్కలు నాటే లక్ష్యం
- విజయవాడ హైవేపై 2 గంటల్లో లక్ష మందితో 163 కిలోమీటర్ల పొడవునా మొక్కలు నాటే కార్యక్రమం
- గ్రేటర్‌లో ఈనెల 11న ఒకేరోజు 25 లక్షల మొక్కలు నాటే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ఆకుపచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం రెండో విడతకు సర్వం సిద్ధమైంది. రెండు వారాల పాటు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద ప్రారంభిస్తారు. మొత్తంగా ఈ వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం 4,213 నర్సరీల్లో సుమారు 200 రకాల మొక్కలను సిద్ధం చేశారు. అయితే గతేడాది చేపట్టిన హరితహారం తొలివిడత వర్షాభావం కారణంగా నత్తనడకన సాగింది. ఈసారి వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో 46 కోట్ల మొక్కలు నాటి రికార్డు సాధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇటీవల సమీక్షించి, అధికార యంత్రాంగానికి కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో అటవీ, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్య, నీటిపారుదల, ఎక్సైజ్, రోడ్లు భవనాల శాఖ తదితర 25 కీలక విభాగాలు పాలుపంచుకోనున్నాయి. గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలోని అన్ని శాఖల మంత్రులు, పార్లమెంటు సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
33 శాతం పచ్చదనం లక్ష్యంగా..
పర్యావరణ సమతౌల్యం కోసం భూభాగంలో 33 శాతం అడవులు, పచ్చదనం ఉండాలి. కానీ ప్రస్తుతం ఇది దేశవ్యాప్తంగా చూస్తే 22 శాతం, తెలంగాణలో 24 శాతమే ఉంది. ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ గతేడాది రంగారెడ్డి జిల్లా చిలుకూరులో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడేళ్లలో 230 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో తొలి ఏడాది 40 కోట్ల మొక్కలు నాటాలన్న లక్ష్యం పెట్టుకున్నా... వర్షాభావ పరిస్థితుల కారణంగా 15 కోట్లకు మించలేదు. దీంతో ఈసారి రికార్డు స్థాయిలో 46 కోట్ల మొక్కలను నాటి వచ్చే యేటికి లక్ష్యాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈసారి నాటే 46 కోట్ల మొక్కల్లో 36.81 కోట్ల మొక్కలు నీడనిచ్చే మర్రి, రావి, వేప వంటివి కాగా... టేకు, మద్ది వంటి లాభదాయకమైన చెట్లు 8.5 కోట్లు సిద్ధం చేశారు. మరో కోటి వరకు పండ్ల మొక్కలను, చెరువు కట్టలపై పెంచేందుకు కోటి ఈత మొక్కలు, పూల మొక్కలను సిద్ధం చేశారు.
రెండుగంటల్లో లక్షన్నర మొక్కలు
సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో హరితహారాన్ని ప్రారంభించే సమయంలోనే.. హైదరాబాద్-విజయవాడ హైవేపై 163 కిలోమీటర్ల మేర 2 గంటల్లో లక్షన్నర మొక్కలు నాటేందుకు ప్రభుత్వ శాఖలు ప్రణాళిక తయా రు చేసుకున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి సరిహద్దు అయిన నల్లగొండ జిల్లా కోదాడ మండలం నల్లబండగూడెం వరకు రోడ్డుకు ఇరువైపులా లక్షన్నరకు పైగా మొక్కలు నాటనున్నారు. ఈ మొత్తం దూరాన్ని 14 సెగ్మెంట్లుగా విభజించి ప్రతి సెగ్మెంటుకు ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు ఈ రహదారిపై 6 అసెంబ్లీ నియోజకవర్గాలు, 10మండలాలు, 50 గ్రామా ల పరిధి ఉంది. ఒకేసారి లక్ష మంది 163 కిలోమీటర్ల మేర మొక్కలు నాటడం రికార్డుగా నిలుస్తుందని సీఎం కార్యాలయం పేర్కొంది.
హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ పరిధిలో..
కాంక్రీట్ అడవిగా మారిన హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఐదేళ్లలో హెచ్‌ఎండీఏ పరిధిలో 7 కోట్ల చెట్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో 3 కోట్ల చెట్లు పెంచే లక్ష్యంలో భాగంగా ఈనెల 11న ఒక్కరోజే 25 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు.