గురుకులాలకు అతిథి గురువులు!
బీసీ గురుకులాల్లో 714 మంది ఎంపికకు నిర్ణయించిన ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్
సాక్షి, హైదరాబాద్: కొత్త బీసీ గురుకులాల్లో గెస్ట్ టీచర్లను నియమించాలని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) నిర్ణయించింది. గెస్ట్ టీచర్ల ప్రతిపాదనలకు సర్కారు పచ్చజెండా ఊపింది. 2017–18 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభమయ్యే 119 బీసీ గురుకులాల్లో 714 మంది గెస్ట్ టీచర్లను ప్రభుత్వం నియమించనుంది. ఒక్కో గురుకులానికి ఆరుగురు చొప్పున నియమించాలని ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో సొసైటీ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఒకట్రెండు రోజుల్లో గెస్ట్ టీచర్ల నియామకానికి సంబంధించి ప్రకటన ఇవ్వనుంది. నిర్ణీత సంఖ్యకు మించి రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వస్తే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని సొసైటీ భావిస్తోంది.
ఈ ప్రక్రియంతా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఒక్కో గురుకులానికి జూనియర్ అసిస్టెంట్, అటెండర్ చొప్పున 238 మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించనుంది. ఈ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించేలా సొసైటీ ప్రణాళిక రూపొందించింది. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి ఈ మేరకు సిబ్బందిని నియమించనుంది. అలాగే, విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతిళ్లు, రాత్రి భోజనం అందించేందుకు ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు అప్పగిస్తోంది. ఒక్కో గురుకులానికి ఇద్దరు వాచ్‌మన్ల చొప్పున 238 మందిని ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎంపిక చేయాలని భావిస్తోంది.