BC Gurukuls
-
కొత్త గురుకులాలు రెడీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల కోసం కొత్తగా మంజూరు చేసిన 119 గురుకుల పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 19 పాఠశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య ఎన్నో రెట్లు పెరిగింది. 2017–18 విద్యా సంవత్సరంలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించగా.. 2019–20 విద్యా సంవత్సరంలో మరో 119 గురుకుల పాఠశాలలను స్థాపించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలో చర్యలు చేపట్టిన మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కసరత్తు పూర్తి చేసింది. 119 గురుకుల పాఠశాలలకు అద్దె భవనాలను సిద్ధం చేసి అందులో మౌలిక వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. పుస్తకాలు, విద్యార్థుల మెటీరియల్‌ను ఇప్పటికే పాఠశాలల్లో అందుబాటులో పెట్టింది. దాదాపు అన్ని పాఠశాలల్లో సిబ్బంది సర్దుబాటు సైతం పూర్తయింది. వాస్తవానికి ఈ నెల 12 నుంచి బడులు ప్రారంభమవుతాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొత్త గురుకులాలు మాత్రం 17వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. 28,560 మందికి లబ్ధి.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గురుకులం చొప్పున 119 గురుకుల పాఠశాలలు వారంరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కొత్త గురుకులాల్లో 5, 6, 7 తరగతులను ప్రారంభిస్తారు. ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి అప్‌గ్రేడ్ అవుతుంది. కేజీ టూ పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న గురుకుల పాఠశాలలను ఇకపై జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు. పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ అయిన వాటిల్లో ఇంటర్మీడియట్‌ను సైతం ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది కొత్తగా 119 గురుకులాల ప్రారంభంతో అదనంగా 28,560 మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది. కొత్త వాటితో కలిపితే రాష్ట్రంలో మొత్తం 257 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 94,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మరో రెండేళ్లలో ఈ విద్యార్థుల సంఖ్య లక్ష దాటనుంది. గురుకులాల్లో జూనియర్ కాలేజీలు సైతం ప్రారంభిస్తే విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుంది. కొత్త గురుకులాల ప్రారంభంతో ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ అతి పెద్ద గురుకుల సొసైటీగా అవతరించనుంది. ఇప్పటివరకు 238 గురుకుల పాఠశాలలతో పెద్ద సొసైటీగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ని రికార్డును బీసీ గురుకుల సొసైటీ అధిగమించనుంది. వచ్చే ఐదేళ్లలో అత్యధిక విద్యార్థులున్న సంస్థగా బీసీ గురుకుల సొసైటీ అవతరించనుంది. -
గురుకులాలకు అతిథి గురువులు!
బీసీ గురుకులాల్లో 714 మంది ఎంపికకు నిర్ణయించిన ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ సాక్షి, హైదరాబాద్: కొత్త బీసీ గురుకులాల్లో గెస్ట్ టీచర్లను నియమించాలని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) నిర్ణయించింది. గెస్ట్ టీచర్ల ప్రతిపాదనలకు సర్కారు పచ్చజెండా ఊపింది. 2017–18 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభమయ్యే 119 బీసీ గురుకులాల్లో 714 మంది గెస్ట్ టీచర్లను ప్రభుత్వం నియమించనుంది. ఒక్కో గురుకులానికి ఆరుగురు చొప్పున నియమించాలని ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో సొసైటీ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఒకట్రెండు రోజుల్లో గెస్ట్ టీచర్ల నియామకానికి సంబంధించి ప్రకటన ఇవ్వనుంది. నిర్ణీత సంఖ్యకు మించి రెట్టింపు సంఖ్యలో దరఖాస్తులు వస్తే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని సొసైటీ భావిస్తోంది. ఈ ప్రక్రియంతా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు సిద్ధమవుతున్నారు. ఒక్కో గురుకులానికి జూనియర్ అసిస్టెంట్, అటెండర్ చొప్పున 238 మందిని అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమించనుంది. ఈ బాధ్యతలు జిల్లా కలెక్టర్లకు అప్పగించేలా సొసైటీ ప్రణాళిక రూపొందించింది. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఏజెన్సీల నుంచి ఈ మేరకు సిబ్బందిని నియమించనుంది. అలాగే, విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం చిరుతిళ్లు, రాత్రి భోజనం అందించేందుకు ప్రైవేటు కంపెనీకి బాధ్యతలు అప్పగిస్తోంది. ఒక్కో గురుకులానికి ఇద్దరు వాచ్మన్ల చొప్పున 238 మందిని ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఎంపిక చేయాలని భావిస్తోంది. -
నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి జడ్చర్ల : తెలంగాణలోని పేద విద్యార్థులందరికీ కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యనందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం జడ్చర్లలో మైనారిటీ గురుకుల పాఠశాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరం 8 మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి ఉత్తమమైన అధ్యాపకులను నియమించామన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను సైతం త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారే ఉన్నత స్థాయిలో రానిస్తున్నారన్నారు. వచ్చే సంవత్సరం నాటికి దాదాపు 5 నుంచి 10 ఎకరాల స్థలంలో అన్ని హంగులతో సొంత భవనాన్ని నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఇదే హాస్టల్లో ఉండి చదివా.. తాను జడ్చర్లలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకుల పాఠశాల భవనంలో కొనసాగిన హాస్టల్లో ఉండి చదువుకున్నానని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. మైనారిటీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌కు ధీటుగా ఏర్పాటు చేసిన మైనారిటీ గురుకులాలను వినియోగించుకోవాలన్నారు. పేదల కలలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్, డిప్యూటీ కలెక్టర్ మాసుమాబేగం, జెడ్పీటీసీ సభ్యురాలు జయప్రద, ఎంపీపీ లక్ష్మి, కోఆప్షన్ సభ్యుడు ఇమ్ము, తహసీల్దార్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీడీఓ మున్నీ, ప్రిన్సిపాల్ నయీమొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.