చెదురుతున్న డాలర్ కల! | H1B visa difficult to Indian students | Sakshi
Sakshi News home page

చెదురుతున్న డాలర్ కల!

Published Thu, Nov 26 2015 2:09 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

చెదురుతున్న డాలర్ కల! - Sakshi

చెదురుతున్న డాలర్ కల!

హెచ్1బీ వీసాపై ఆంక్షలు పెడుతున్న అమెరికా
చదువులకు సై.. కొలువులకు నై అంటూ నిబంధనలు
ఉన్నత చదువుల కోసం యూఎస్ వెళ్లే విద్యార్థులకు శరాఘాతం
హెచ్1బీ వీసా పొందేందుకు గతంలో మూడేళ్లలో 3 సార్లు అవకాశం
ఇప్పుడు రెండేళ్లలో రెండుసార్లే చాన్స్.. వచ్చే ఫిబ్రవరి నుంచి అమల్లోకి నిబంధన
ఈ అవకాశాన్ని కూడా ఏడాదికే కుదించేస్తూ మరో కొత్త చ ట్టానికి యోచన
అమెరికా ఉద్యోగం ఇక గగన కుసుమం కానుందా?
మన విద్యార్థుల ‘డాలర్ డ్రీమ్’పై నీలినీడలు కమ్ముకుంటున్నాయా?


చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు గేట్లెత్తేస్తున్న అమెరికా.. ఉద్యోగాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం తలుపులు మూసేస్తోందా? తాజా పరిస్థితులు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం ఇస్తున్నాయి. హెచ్1బీ(వర్క్ పర్మిట్) వీసాలపై అమెరికా ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు... ఉన్నత చదువుల కోసం భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చనున్నాయి.
 - సాక్షి ప్రత్యేక ప్రతినిధి
 
మూడొంతుల విద్యార్థులు వెనక్కే!
విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో భారీగా ఆదాయం ఆర్జిస్తున్న అమెరికా.. కొలువుల దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తోంది. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చేయడానికి ఈ ఏడాది మన దేశం నుంచి 1.34 లక్షల మంది వెళ్లారు. వీరు ఒక్కో సెమిస్టర్‌కు సగటున ఆరు వేల డాలర్ల ఫీజు కట్టినా మూడు సెమిస్టర్లకు కలిపి దాదాపు 15.9 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఇంతపెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నా అమెరికా ప్రభుత్వం మాత్రం.. వారు అక్కడ ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్1బీ వీసాను కఠినతరం చేసింది. గతంలో లాటరీ ద్వారా ఈ వీసా పొందేందుకు మూడేళ్లలో మూడు అవకాశాలు ఉండేవి. ఇప్పుడు దాన్ని రెండేళ్లకు కుదించి రెండు అవకాశాలే కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచే ఈ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది.
 
 అంతటితో ఆగకుండా అమెరికా ప్రభుత్వం.. మరో కఠిన బిల్లుకు రూపకల్పన చేసింది. దాన్ని ఒబామా ప్రభుత్వం ఇప్పటికే సెనెట్‌కు కూడా పంపింది. ఆ బిల్లు చట్టరూపం దాలిస్తే.. విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సంవత్సరం లోపే హెచ్1బీ వీసా పొందాలి. లేదంటే హెచ్1బీ వీసా వచ్చేదాకా గరిష్టంగా ఐదేళ్లపాటు ఏదో ఒక కోర్సు చదువుతూ ఉండాలి. నాలుగైదేళ్లు అక్కడే ఉండి చదివే స్తోమత లేనివారికి ఇది శరాఘాతంగా మారనుంది. చట్టం అమలైతే అమెరికాలో చదవడానికి వెళ్లిన వారిలో మూడొంతుల మంది చదువు పూర్తి కాగానే స్వదేశానికి తిరుగుముఖం పట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.
 
ఎందుకీ నిబంధనలు?
మూడేళ్ల క్రితం వరకు అమెరికా వెళ్లిన విద్యార్థుల్లో 80 శాతం మంది నిర్దేశించిన సమయంలోనే హెచ్1బీ వీసా పొందారు. గడచిన రెండేళ్లుగా విదేశీ విద్యార్థుల సంఖ్య భారీగా ఉండటం, తమ పౌరులకు ఉద్యోగాలు దొరకకపోవడం వంటి కారణాలతో హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం చేయాలని అమెరికా ప్రభుత్వం భావించింది. అందుకు తగ్గట్టుగా వీసా అవకాశాలను తగ్గించేస్తోంది. దానికి తోడు అమెరికాలోని ఐటీ సహా అన్ని కంపెనీల్లో స్థానికులు కచ్చితంగా 50 శాతం ఉండాలన్న నిబంధన తీసుకురాబోతోంది. అక్కడ మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా ఎక్కువ మంది ఉంటే వారి విద్యార్హతలను బట్టి లాటరీకి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తోంది. అంటే.. అమెరికన్ వర్సిటీలో చదివిన విద్యార్థులు ఏ ప్లస్, ఏ గ్రేడ్ వస్తేనే హెచ్1బీకి అనుమతిస్తారు. ఈ నిబంధన వల్ల చదువుకుంటూ చిన్నాచితక పనులతో డాలర్లు సంపాదించాలనుకునే వారు ఇంటిదారి పట్టాల్సి వస్తుంది.
 
మంచి స్కోర్ ఉంటేనే వెళ్లడం మంచిది
పిల్లల చదువు ఎలా ఉంది.. డిగ్రీలో వారు ఎంత శాతం మార్కులు సాధించారు.. జీఆర్‌ఈలో మెరుగైన స్కోర్ సాధించారా లేదా అన్నది పట్టించుకోకుండానే చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని అమెరికా పంపుతున్నారు. విద్యార్థులు కూడా తమ సామర్థ్యాలను సరిగా అంచనా వేసుకోకుండానే ‘చలో అమెరికా’ అంటున్నారు. ఇదే అక్కడ వారి ఇబ్బందులకు కారణమవుతుందంటున్నారు కన్సల్టెన్సీ నిపుణులు. ‘‘అమెరికా డాలర్లు సంపాదించాలంటే అక్కడ యావరేజ్, ఫుల్‌టైమ్ ఉద్యోగం దొరకాలి. అలాగే నిర్దేశిత సమయంలో హెచ్1బీ వీసా రావాలి. ఇది జరగాలంటే ఇక్కడ్నుంచి వెళ్లే విద్యార్థి బీటెక్ లేదా సంబంధిత డిగ్రీలో ఒక్క బ్యాక్‌లాగ్ కూడా ఉండొద్దు. డిస్టింక్షన్‌లో పాసవ్వాలి. జీఆర్‌ఈలో 300, టోఫెల్‌లో 85 పైన స్కోర్ వచ్చి ఉండాలి’’ అని పాతిక సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కన్సల్టెన్సీ నడుపుతున్న రామ్మోహన్‌రావు చెప్పారు. ఏ స్కోర్ లేకుండానే అమెరికా వెళ్లి ఏదో ఒక వర్సిటీలో చదువుకుంటున్న వారు కాలక్రమంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు.
 
తల్లిదండ్రులపై పెనుభారం..
పొలం లేదా ఆస్తులు కుదువపెట్టి పిల్లలను అమెరికా పంపించిన తల్లిదండ్రులు సకాలంలో రుణం చెల్లించలేక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అమెరికా విద్య కోసం అప్పు చేసిన వారిలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 46.53 శాతం మంది డిఫాల్టర్ల జాబితాలో చేరారు. ఇక్కడ్నుంచి వెళ్లిన విద్యార్థులు అత్యధికులు తాత్కాలిక ఉద్యోగాలకే ప్రాధాన్యమిచ్చి చదువులు పక్కనపడేస్తున్నారు. ఫలితంగా బొటాబొటి మార్కులతో పాసవుతున్నారు. ఇలాంటివారి దరఖాస్తులను కంపెనీలు ఇంటర్వ్యూ కంటే ముందే తిరస్కరిస్తాయి. దీంతో అలాంటి వారు తాత్కాలిక ఉద్యోగాలపైనే ఆధారపడుతున్నారు. అయితే ఎన్ని ఆంక్షలు పెట్టినా అకడమిక్‌గా మంచి ప్రతిభ కనబరిచిన వారికి, ఓ మోస్తరు పేరున్న విశ్వవిద్యాలయంలో ఎంఎస్ పూర్తి చేసి ఏ గ్రేడ్ సాధించిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నారు.
 
ప్రతిభతో పనిలేకున్నా..
అమెరికాలో సీటు ఇప్పిస్తామంటూ వేలంవెర్రిగా కన్సల్టెన్సీలు వెలిశాయి. జీఆర్‌ఈ స్కోర్ లేకపోయినా సీటిప్పిస్తామంటూ పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయంటే అమెరికాలో ఈ వ్యాపారం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో మాస్టర్ డిగ్రీ చదువుకోవడానికి కనీస అర్హత జీఆర్‌ఈ. ఈ పరీక్ష 340 మార్కులకు ఉంటుంది. ఇందులో 320 దాటితేనే అమెరికాలోని టాప్ 25 వర్సిటీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. జీఆర్‌ఈ స్కోర్ 300పైన, టోఫెల్ స్కోర్ 85, ఐఈఎల్‌టీఎస్ స్కోర్ 7.5 ఉంటే తప్ప టాప్ 100 వర్సిటీల్లో సీటు దొరకదు. కానీ భారతీయ విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కాలిఫోర్నియా, టెక్సాస్, అరిజోనా, ఒక్లహోమా, ఇల్లినాయిస్ వంటి రాష్ట్రాల్లో వర్సిటీలు ఒక్కొక్కటీ ఎనిమిది నుంచి 10 బ్రాంచీలు ఏర్పాటు చేసి ఎంఎస్ డిగ్రీ ఆఫర్ చేస్తుండడం గమనార్హం. జీఆర్‌ఈలో 265, టోఫెల్‌లో 55, ఐఈఎల్‌టీఎస్‌లో 5.5 వస్తే చాలు సీట్లు ఆఫర్ చేస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement