'ప్రతిభావంతులే మాకు కావాలి' | Indian students should be made aware of visa requirements: Angela Price Aggeler | Sakshi
Sakshi News home page

'ప్రతిభావంతులే మాకు కావాలి'

Published Sat, Jun 25 2016 6:25 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

'ప్రతిభావంతులే మాకు కావాలి' - Sakshi

'ప్రతిభావంతులే మాకు కావాలి'

'కళ్ల నిండా కలలున్న ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులు మాకు కావాలి. వారికి అన్ని విధాలా సాయపడాలన్నదే మా ఆకాంక్ష' అన్నారు అమెరికా విదేశాంగ శాఖ దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఏంజిలా ప్రైస్ అగ్లేర్. హైదరాబాద్లో వాతావరణ మార్పులపై జరిగిన సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన అగ్లేర్ సాక్షి కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భారత అమెరికా సంబంధాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరు, భారతీయ విద్యార్థులకు అతి కీలకమైన హెచ్ వన్ బి వీసా గురించి ఆమె సాక్షి ప్రతినిధి తో ముచ్చటించారు.

ఇటీవలి కాలంలో భారత అమెరికా సంబంధాలు మూస ధోరణులను దాటి కొత్త ఎత్తులకు ఎదుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఎన్నో సారూప్యాలున్నాయి. మీది అతి పురాతన ప్రజాస్వామ్యం. మాది అతి పెద్ద ప్రజాస్వామ్యం. భారత అమెరికా సంబంధాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
భవిష్యత్తు బంగారు కాంతులతో ఉండబోతోందని నాకు అనిపిస్తోంది. భారత అమెరికా సంబంధాలు ఏళ్లు, దశాబ్దాల తరబడి క్రమ వికాసం చెందుతూ వస్తున్నాయి. మనది చాలా కీలకమైన మైత్రి. ఇది మాకూ ముఖ్యం. మీకూ అంతే ముఖ్యం. దీనికి అతి చక్కటి ఉదాహరణ ఇటీవల భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనే. ఇరు దేశాల సంబంధాలలోని అన్ని కోణాలను, పరిధులను ఆయన స్పృశించారు. ఆయన సెనేట్ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగం మన మైత్రి ఎలా ముందుకు వెళ్తుందో వివరించే ఒక సాహసోపేతమైన, చైతన్యవంతమైన ముందడుగు. శాంతియుత పరమాణు రంగం, సైనిక రంగం, భద్రత, ఇంధనం, ఆర్ధికం ... ఇలా అన్ని రంగాలలో మన సంబంధాలను ఆయన స్పృశించారు. భారత ప్రభుత్వంతో, ప్రజలతో మాకున్న సంబంధాల విస్తృతి ఎలా నానాటికీ బలోపేతమౌతోందో ఆయన వివరించారు.

ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులు వృద్ధి చెందుతున్నాయి. ఈ సంబంధాలు ఏ మేరకు వృద్ధి చెందే అవకాశం ఉంది?
వాణిజ్య సంబంధాలు చాలా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. అయితే మరింత ఎదుగుదలకు అవకాశం ఉంది. విస్తరించాల్సిన రంగాలు ఇంకా ఉన్నాయి. భారతదేశం ఒక పవర్ హౌస్. 130 కోట్ల జనాభా ఉన్న దేశం ఇది. ఇందులో నలభై శాతం మంది వయసు ఇరవై ఏళ్ల లోపే. జనాభా పరంగా ఇది చాలా గణనీయమైన విషయం. ఈ దేశంలో అభివృద్ధికి బోలెడన్ని అవకాశాలున్నాయి. హైదరాబాద్ లోనూ గతేడాదితో పోలిస్తే పెట్టుబడులు 27 శాతం పెరిగాయి. ఇది చాలా పెద్ద విషయం. తెలంగాణలో, హైదరాబాద్ లో, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి. వీటిని మరింత పెంపొందించుకోవడం, విస్తరింప చేసుకోవడం ఇరు దేశాలకూ అవసరం.

దక్షిణాసియాలోని పరిణామాల నేపథ్యంలో ఉగ్రవాద వ్యతిరేక పోరాట భాగస్వాములుగా భారత, అమెరికాలు సంబంధాలను ఏ విధంగా చూడాలి?
ఈ విషయంపై భారత అమెరికాలు నిరంతరాయంగా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. ఉగ్రవాదం ఒక శాపం. ఇది భారత్ కి, అమెరికాకి మాత్రమే కాదు, యావత్ప్రపంచానికి కూడా ఒక పెను శాపం. ఇది ఇరు దేశాలకూ చాలా ప్రాధాన్యం ఉన్న విషయం. భద్రతా వ్యవహారాల దిశగా చాలా చేస్తున్నాం. ఇంకా చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా మరింత భద్రతను సాధించగలుగుతాం. విద్యతో సహా వివిధ రంగాల్లో మన భాగస్వామ్యం ఎంత ఎక్కువగా ఉంటే ఈ సవాళ్లను మనం అంత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం.

ఇరు దేశాల మధ్య మైత్రీ సంబంధాలు పెరుగుతున్నా, కొన్ని విషయాల్లో మాత్రం ఇంకా కొన్ని పొరపొచ్చాలు ఉన్నాయి. భారత అమెరికాలు వీటిని ఎలా తొలగించవచ్చు?
ఎంత గొప్ప సంబంధమైనా ఒడిదుడుకులు తప్పకుండా ఉంటాయి. ప్రతి వివాహంలోనూ సమస్యలుంటాయి. అత్యంత సన్నిహితులైన మిత్రులు కూడా విభేదిస్తారు. నిజానికి విభేదించడం ఆరోగ్యకరమైనది. కానీ సంభాషణ కొనసాగుతూ ఉండాలి. అభిప్రాయాలు పంచుకోవడం కొనసాగుతూ ఉండాలి. భారత ప్రభుత్వంతో, ప్రజలతో, అదికారులతో, పారిశ్రామిక వేత్తలతో అభిప్రాయాలను పంచుకోవడాన్ని కొనసాగించడం ద్వారానే అభిప్రాయ భేదాలను తొలగించడానికి వీలవుతుంది. అన్నిటి కన్నా ముఖ్యం చర్చలు కొనసాగడం.


ఇటీవల హెచ్ 1 బి వీసా ఫీజును పెంచడం జరిగింది. దీని వల్ల భారత్ పై ప్రభావం ఉండబోతోంది. దీనిపై మీరేమంటారు?

వీసాలకు సంబంధించిన నిర్ణయాలు ద్వైపాక్షికమైనవి కావు. అది గ్లోబల్ స్థాయి నిర్ణయం. భారత్ ఎంతో మంది ప్రతిభావంతులైన ఉద్యోగులను, మేథావులను, విద్యార్థులను అమెరికాకి పంపుతోంది. దాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఫీజు పెంపు వల్ల అమెరికాకి వచ్చే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్యపై ఎలాంటి ప్రభావం ఉండకూడదని మేం ఆశిస్తున్నాం.

అంటే దీని వల్ల అమెరికాకి వెళ్లే విద్యార్థులు ఉద్యోగుల సంఖ్య తగ్గదని అంటున్నారా?
విద్యార్థుల ఉదాహరణనే తీసుకుందాం. భారత్ అమెరికాకు అతి పెద్ద సంఖ్యలో విద్యార్థులను పంపుతోంది. వారు మా వద్ద చదవాలని కోరుకుంటున్నాం. వారు మేథోపరమైన నైపుణ్యాలను, ప్రతిభా పాటవాలను తమతో పాటు మా దేశానికి తీసుకువస్తారు. మా క్యాంపస్ లకు వైవిధ్యాన్ని పంచుతున్నారు. వారు మా కాలేజీలు, యూనివర్సిటీల్లో చదవాలని కోరుకుంటున్నారు. అది మంచిదే. నిజానికి అలాంటి వారికి అమెరికాకి వచ్చేందుకు వీసా పొందడానికి ఏమేం కావాలో, అమెరికాలోకి ప్రవేశించేందుకు ఏం చేయాలో అవగాహనను కల్పించాల్సిన అవసరం ఉంది.

అమెరికాకి వీసా రావడం వేరు. అమెరికాలో పాదం మోపడం వేరు. విద్యార్థులు తమ పాస్ పోర్టు, వీసాలను హోమ్ లాండ్ సెక్యూరిటీ అధికారులకు ఇచ్చే సమయంలో పత్రాలన్నీ సరిగా ఉండేలా, అన్ని విషయాలకూ సరైన సమాధానాలు ఇవ్వగలిగేలా వారికి అవగాహనను కల్పించాలి. కళ్ల నిండా కలలున్న ప్రతిభావంతులైన భారతీయ విద్యార్థులు మాకు కావాలి. వారికి అన్ని విధాలా సాయపడాలన్నదే మా ఆకాంక్ష.

మీరు వాతావరణ మార్పుల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కి వచ్చారు. వాతావరణ మార్పుల విషయంలో ఇరు దేశాల దృక్పథాల్లో వైరుధ్యం ఉంది. వాతావరణ మార్పుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ భూమిక విషయంలో అమెరికా అభిప్రాయం ఏమిటి?

వాతావరణ మార్పుల విషయంలో ఎంతో చేశాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇరు దేశాలూ చేయాల్సింది, ప్రపంచ దేశాలు చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. ప్రధానమంత్రి మోదీ ఈ సవాళ్ల విషయంలో ఎంతో సాహసోపేతంగా వ్యవహరిస్తున్నారు. పలు రకాల సవాళ్లు ఉన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో నిబద్ధత ఉంటే దారి దొరుకుతుంది. ఒప్పందాలు చేసుకోవడం ప్రధానం. కానీ వాటిని సమర్థవంతంగా అమలు చేయడం ఇంకా ముఖ్యం. ఇరు పక్షాల్లో వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో నిబద్ధత, క్రియాశీలత ఉన్నాయి. అధ్యక్షుడు ఒబామా, ప్రధాని మోదీ ల ప్రకటనలు ఈ విషయాన్నే చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement