అడ్డుకుంటోంది చంద్రబాబే
పాలమూరు ప్రాజెక్టులకు ఆటంకం కలిగిస్తున్నారు: హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వలసల జిల్లా పాలమూరులో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. అయినదానికి, కానిదానికి కేం ద్రానికి ఫిర్యాదు చేస్తూ చంద్రబాబు తన నైజాన్ని చాటుకుంటున్నారన్నారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద, నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2, 3 లిఫ్ట్‌లను ప్రారంభిం చి, సాగునీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా రెండు చోట్లా నిర్వహించిన బహిరంగ సభల్లో హరీశ్ మాట్లాడారు. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. పాలమూ రు ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు ప్రశ్నించ డం లేదన్నారు. కల్వకుర్తితోపాటు మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ 98 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని కాంగ్రెస్, టీడీపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని.. తమ తప్పులను కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో పూర్తయింది 70 శాతమేనని, ఇంకా 30 శాతం పనులను రూ.2వేల కోట్లతో పూర్తిచేయాల్సి ఉందని చెప్పారు. దీనితోపాటు మరో రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని, వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి వాటి నుంచి రైతులకు సాగునీరు అందించి తీరుతామని పేర్కొన్నారు.
అభివృద్ధిని జీర్ణించుకోలేకే రాద్ధాంతం
కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని హరీశ్‌రావు మండిపడ్డారు. అందుకే ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేస్తూ.. ప్రజోపయోగ పనులను అడ్డుకుంటోందని విమర్శించారు. ప్రజలకు పాలనా సౌలభ్యం కలగాలన్న లక్ష్యంతో కొత్త జిల్లాలకు శ్రీకారం చుడితే.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా నడిబొడ్డున ఉన్న గద్వాల ప్రాంతానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని.. ఆ ప్రాంత ప్రజలకు అన్యాయం జరగనివ్వబోమని పేర్కొన్నారు.
తమ ప్రాంతం అన్యాయానికి గురైందని కాంగ్రెస్ నేత డీకే అరుణ పదే పదే చెబుతున్నారని... 40 ఏళ్లుగా ఆ ప్రాంత ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉన్నది వారి కుటుంబ సభ్యులు కాదా అని, అభివృద్ధి చెందకపోవడానికి కారకులు వారే కాదా అని హరీశ్ ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చేపట్టి 30 ఏళ్లయినా కాంగ్రెస్, టీడీపీలు ఒక్క ఎకరానికి సాగునీరు అందించలేకపోయాయన్నారు. అదే తమ ప్రభుత్వం సాగునీటిని అందించి రైతుల కళ్లలో ఆనందం నింపుతోందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బాలరాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు.
కొబ్బరికాయలు కొట్టి వదిలేశారు..
సమైక్యాంధ్రలో అప్పటి సీఎంలు చంద్రబాబు, వైఎస్‌ఆర్‌లు ప్రాజెక్టుల ప్రారంభ పనులకు టెంకాయలు కొట్టి, ఆ తర్వాత పట్టించుకోలేదని హరీశ్‌రావు ఆరోపించారు. ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లిస్తున్నది తామేనని చెప్పారు. గత పాలకులు రాయలసీమకు సాగునీరు అందించే హంద్రీనీవా ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధను కల్వకుర్తిపై చూపలేదన్నారు. ఈ వివక్షను అప్పుడే ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తే.. నాలుగేళ్ల కిందే కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు.