
హెచ్‌సీయూ విద్యార్థుల విడుదల
చర్లపల్లి జైలు నుంచి ర్యాలీగా వర్సిటీకి
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి జైలులో ఉన్న హెచ్‌సీయూ విద్యార్థులు మంగళవారం రాత్రి 9 గంటలకు బెయిలుపై విడుదలయ్యారు. వీరిలో ప్రొఫెసర్లు రత్నం, తథాగత్, ఏఎస్‌ఏ అధ్యక్షుడు ప్రశాంత్, జేఏసీ నాయకుడు వెంకటేశ్‌చౌహాన్, లింగస్వామి, అచ్యుతరావు, హరీష్‌లతో పాటు మొత్తం 25 మంది ఉన్నారు. మియాపూర్ కోర్టు న్యాయమూర్తి వరూధిని బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. వీరి విడుదల కోసం ఉదయం నుంచి జైలు బయట విద్యార్థులు, ప్రొఫెసర్ల నిరీక్షించారు.
విడులైన అనంతరం జీవీవీ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య, రోహిత్ తల్లి రాధిక తదితరులతో కలసి ప్రదర్శనగా హెచ్‌సీయూకు వెళ్లారు. వారందరికీ హెచ్‌సీయూ వద్ద విద్యార్థులు కాగడాలు చేతపట్టి ఘనస్వాగతం పలికారు. ఏఎస్‌ఏ నాయకుడు ప్రశాంత్ మాట్లాడుతూ... చెరసాలలు, ఉరికొయ్యలు తమ ఉద్యమాన్ని ఆపలేవన్నారు. ప్రొఫెసర్ రత్నం మాట్లాడుతూ... వీసీ అప్పారావును తొలగించేవరకు తమ పోరాటం ఆగదన్నారు.