
సాక్షి, హైదరాబాద్ : ఆమరణ దీక్ష వైపుగా ముందుకెళుతున్న సంగీతను తొలి విజయం వరించింది. మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీత భర్త శ్రీనివాస్ రెడ్డికి మొట్టికాయలు వేసింది. ఆమెను గౌరవ ప్రదంగా ఇంటికి తీసుకెళ్లాలని చెప్పింది. అదే సమయంలో ప్రతి నెల మెయింటెన్స్‌కు రూ.20వేలు చెల్లించాలని ఆదేశించింది. బోడుప్పల్‌కు చెందిన సంగీత తన భర్త శ్రీనివాసరెడ్డి వేధింపులపై గత 54 రోజులుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, గురువారం ఈ కేసు విచారణలో భాగంగా మియాపూర్ ఫ్యామిలీ కోర్టు సంగీతకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
సంగీతకు మెయింటెనెన్స్ ఖర్చులు నెలకు రూ.20 వేలు చెల్లించాలని, అలాగే, ఆమెను గౌరవ ప్రదంగా ఇంట్లోకి భర్త తీసుకెళ్లాలని ఆదేశించింది. అయితే, దీనిపై భర్త శ్రీనివాస్‌రెడ్డి మరోసారి కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. భార్యను బాగానే చూసుకుంటానని, ఆమె తన వద్దే ఉంటుందని అలాంటప్పుడు మెయింటెన్స్ ఖర్చులు ఎందుకు ఇవ్వడం అని ఆ కౌంటర్‌లో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. భర్త, అత్తమామలు కొడుతూ, లైంగికంగా వేధిస్తున్నారంటూ సంగీత కేసు పెట్టిన విషయం తెలిసిందే. మొత్తం మూడు కేసులు ఆమె పెట్టారు. ఈ కేసుకు సంబంధించి భర్త, అత్తమామలు కోర్టుకు హాజరుకాగా సంగీత తరుపున ఆమె సోదరుడు కోర్టుకు హాజరయ్యాడు. సంగీత మాత్రం ఇంకా దీక్షలోనే ఉన్నారు.
రోడ్డున పడ్డాం, రాజీకి రావా..?
Comments
Please login to add a commentAdd a comment