నిఘా నీడన సెంట్రల్ యూనివర్సిటీ
- ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు
- వర్సిటీకి వచ్చే వారందరినీ వీడియో రికార్డింగ్ చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. అలాగే మాదాపూర్ డీసీపీ కార్తీకేయ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, ఆరుగురు సీఐలు, 14 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లతో పాటు టీఎస్‌ఎస్‌పీ(తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్) బలగాలు భారీగా మోహరించారు.
వర్సిటీలో మూడ్రోజులుగా జరుగుతున్న ఆందోళనలపై సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. బయట్నుంచి వర్సిటీకి వస్తున్న వారందరిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారితోపాటు యూనివర్సిటీకి వచ్చిపోయే వారందరినీ వీడియో రికార్డు చేస్తున్నారు. మరోవైపు వర్సిటీ ప్రాంగణంలో అక్కడక్కడ రాళ్ల కుప్పలను నిఘా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపించి వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. ధర్నా ప్రాంగణం పరిసరాలన్నింటినీ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.