ఇప్పటికైనా...
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థల్లోనూ, వెలుపలా కొన్ని రోజులుగా ఎగిసిపడుతున్న ఆగ్రహాగ్ని జ్వాలలు ఢిల్లీ గద్దెను తాకాయి. మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఉదంతంపై స్పందించారు. లక్నోలోని డాక్టర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ సభావేదికపైనుంచి ఈ ఉదంతంవల్ల తనకు కలిగిన మనో వేదనను ఆయన వెల్లడించారు.
రోహిత్ తల్లి పడుతున్న బాధేమిటో అర్ధంచేసుకోగలనని అనడంతోపాటు భరతమాత ముద్దు బిడ్డను కోల్పోయిందని కూడా చెప్పారు. మరోపక్క రోహిత్ విషాద మరణంపై న్యాయ విచారణ జరపడం, ఉన్నతశ్రేణి సంస్థల్లో వివిధ స్థాయిల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణనిప్పించడంవంటి చర్యలు తీసుకుంటామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్‌ఆర్‌డీ) మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది హర్షనీయమే. పాల కులైనవారు స్పందించవలసిన తీరిదే. కానీ అందుకు ఇంత జాప్యం చోటు చేసుకో వాల్సింది కాదు.
దేశవ్యాప్తంగా ఎన్నో విద్యా సంస్థల్లో వేలాదిమంది విద్యార్థులు ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తుంటే...మేధావులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ఇంత అన్యాయమేమిటని నిలదీస్తుంటే ప్రభుత్వం వైపునుంచిగానీ, బీజేపీవైపు నుంచిగానీ ఎవరూ సక్రమంగా స్పందించలేకపోయారు. తమ వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తాయన్న స్పృహ కూడా వారికి లేకపోయింది. వారు సకాలంలో దిద్దుబాటు చర్యలు ప్రారంభించి ఉంటే నరేంద్ర మోదీకి లక్నోలో నిరసనలు ఎదురయ్యేవి కాదు.
రెండు విద్యార్థి సంఘాల మధ్య తలెత్తిన వివాదం ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో, దానికుండే అధికార పరిధుల్లో పరిష్కారం కానీయకపోవడమన్నది ఈ మొత్తం వ్యవహారంలోని కీలకాంశం. అంతా సక్రమంగా జరిగుంటే ఒక యువ మేధావి ప్రాణం నిలబడేది. అక్కడి బౌద్ధిక వాతావరణం సక్రమంగా కొనసాగేది. అందుకు విరుద్ధమైన పరిణామాలు చోటుచేసుకోవడానికి ఎవరెవరి ప్రమేయం దోహదపడిందో కళ్లముందు కనిపిస్తున్నప్పుడు వాటిని సమర్ధించుకోజూడటం తెలివైన పనికాదు. కానీ కిందినుంచి పైవరకూ అందరూ అలాగే వ్యవహరించారు. అందుకు అనుభవలేమి కారణమా, సున్నితంగా ఆలోచించలేకపోవడమా అన్నది వారే తేల్చుకోవాలి. ప్రధాని స్పందించిన తీరు చూశాకైనా ఇటువంటి అంశాల్లో ఎంత జాగ్రత్తగా మెలగాలో, మాట్లాడాలో బీజేపీ నేతలకు అర్ధంకావాలి.
ఒక ఉన్నత శ్రేణి విద్యా సంస్థలో పరిశోధనల్లో నిమగ్నం కావాల్సిన యువ మేధావి...ఈ అసమ సమాజ తీరుతెన్నులతో, అది చేస్తున్న అన్యాయాలతో విసుగెత్తి అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడం ఎంతో విషాదకరమైనది. సమాజం మొత్తం ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సందర్భమిది. కానీ ఇన్ని రోజులుగా రోహిత్ మరణంపై కొందరు మాట్లాడిన మాటలు, లేవదీసిన తర్కాలు ఎంతో అమానుషమైనవి. తన మరణానికి ‘మిత్రులైనా, శత్రువులైనా ఎవరూ కారణం కాద’ంటూ రోహిత్ తన చివరి లేఖలో చేసిన ప్రస్తావన మొదలుకొని ప్రతి అంశం చుట్టూ సందేహాలల్లడానికి కొందరు ప్రయత్నించారు. ఆఖరికి ఆయన కులాన్ని కూడా వివాదం చేయబోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా ఇందుకు మినహాయింపు కాదు.
దౌర్జన్యానికి దిగారని అయిదుగురు దళిత విద్యా ర్థులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన కమిటీనుంచి పరస్పర విరుద్ధమైన నివేదికలు రావడం...చివరి నివేదిక ఆధారంగా విశ్వవిద్యాలయం చర్యకు తయారు కావడం తప్పని స్పష్టంగా కనబడుతున్నప్పుడు దాన్ని సమర్ధించుకోవడానికి స్మృతి ఇరానీ ఎంతో ప్రయత్నించారు. ఈ రెండు నివేదికల మధ్యలో కేంద్రమంత్రి దత్తాత్రేయ తనకు రాసిన లేఖ, దానికి కొనసాగింపుగా తన శాఖనుంచి యూని వర్సిటీకి అయిదు లేఖలు వెళ్లడంలాంటి పరిణామాలపై ఆమె ఇచ్చిన సంజా యిషీలో సహేతుకత లేదు. ఏ ఎంపీ లేఖ రాసినా ఇలాగే స్పందిస్తామని స్మృతి... నాకొచ్చిన లేఖను పైకి పంపానని, ఎవరిచ్చినా ఇలాగే చేస్తానని దత్తాత్రేయ...ఎవరి లేఖలూ మమ్మల్ని ప్రభావితం చేయలేదు, సొంత వ్యక్తిత్వాన్ని ప్రదర్శించి ఈ నిర్ణయం తీసుకున్నామని వైస్ చాన్సలర్ అప్పారావు మాట్లాడిన తీరు పాలనా వ్యవహారాల్లోని లొసుగులనూ, బలహీనతలనూ పట్టిచూపాయి.
రోహిత్ మరణ కారణాలపై న్యాయ విచారణ జరిపిస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ ప్రకటించింది. మంచిదే. కానీ ఈ న్యాయ విచారణ దానికి మాత్రమే పరిమితం కాకూడదు. రోహిత్ మరణం ప్రముఖంగా చర్చలోకి తీసుకొచ్చిన అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఉన్నత శ్రేణి విద్యా సంస్థల్లో దళితులు అడుగడుగునా ఎదుర్కొంటున్నామని చెబుతున్న వివక్ష, వాటి పర్యవసానాల గురించి కూడా ఆ కమిటీ విచారణ జరపాలి. గత దశాబ్దకాలంలో హెచ్‌సీయూలో 12మంది విద్యావంతులు ప్రాణాలు తీసుకుంటే అందులో పదిమంది దళితులని చెబుతున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా విశ్వవిద్యాలయ పాలకమండలిలో ఇంతవరకూ ఒక్క దళిత ప్రొఫెసర్‌కైనా ప్రాతినిధ్యం కల్పించలేదంటే కులం ఎంత బలీయమైన పాత్ర పోషిస్తున్నదో అర్ధమవుతుంది.
ఇది ఒక్క హెచ్‌సీయూకి పరిమితమైనది మాత్రమే కాదు...ఢిల్లీలోని ఎయిమ్స్, ఇతర ఉన్నత శ్రేణి విద్యా సంస్థల పరిస్థితి సైతం ఇలాగే ఉంది. 2007లో థోరట్ కమిటీ ఇచ్చిన నివేదిక మొదలుకొని 2013లో ముంగేకర్ కమిటీ నివేదిక వరకూ అనేక కమిటీలు ఇందుకు సంబంధించిన ఎన్నో ఉదంతాలను బయటపెట్టాయి. ఉన్నత శ్రేణి విద్యా సంస్థల స్వతంత్ర ప్రతిపత్తిని గౌరవిస్తే సమాజ ప్రగతికి దోహదపడగల మెరికల్లాంటి మేధావులను అవి అందించగలుగుతాయి. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే అవి కల్లోల కేంద్రాల వుతాయి. కేంద్రం తాజా నిర్ణయాల తర్వాత కూడా ఆగ్రహం చల్లారని విద్యా ర్థులను ఇప్పుడు ఎలా ఒప్పించగలరన్నదే సమర్ధతకు గీటురాయి అవుతుంది. అందుకవసరమైన పరిణతిని పాలకులు చూపగలరని ఆశించాలి.