హెల్త్‌ కోసం వెల్త్‌! | Health For Wealth! | Sakshi
Sakshi News home page

హెల్త్‌ కోసం వెల్త్‌!

Published Sun, Apr 9 2017 12:07 AM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM

హెల్త్‌  కోసం  వెల్త్‌!

హెల్త్‌ కోసం వెల్త్‌!

- రాష్ట్రాల బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 8 శాతానికి మించి నిధులివ్వాలి
- మనిషి జీవిత కాలాన్ని 67.5 నుంచి 70 ఏళ్లకు పెంచాలి
- జాతీయ ఆరోగ్య విధానంలో రాష్ట్రాలకు కేంద్రం సూచన


సాక్షి, హైదరాబాద్‌: 2020 నాటికి రాష్ట్రాల బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి 8 శాతానికి పైగా నిధులను కేటాయించాలని జాతీయ ఆరోగ్య విధానం–2017 స్పష్టం చేసింది. రాష్ట్రాల బడ్జెట్లలో ఆరోగ్య రంగానికి సరైన కేటాయింపులు ఉండకపోవడం పట్ల కేంద్రం విచారం వ్యక్తం చేసింది. 2017–18 తెలంగాణ బడ్జెట్‌ రూ.1.49 లక్షల కోట్లు కాగా అందులో ఆరోగ్య రంగానికి రూ. 5,424 కోట్లు(3.62 శాతం) కేటాయించింది. తాజా కేంద్ర విధానం మూలంగా వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన ఆరోగ్య విధానాన్ని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. జాతీయ ఆరోగ్య విధానం అనేక ఆరోగ్య లక్ష్యాలను ప్రకటించింది.

అనేక సిఫారసులు చేసింది. ప్రస్తుతమున్న మెడికల్‌ కాలేజీలను బలోపేతం చేయడంతోపాటు జిల్లా ఆస్పత్రులను  మెడికల్‌ కాలేజీలుగా మార్చాలని, తద్వారా వైద్యుల కొరతను తీర్చాలని సూచించింది. కొత్త, కొత్త వ్యాధులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్య సిలబస్‌లో గణనీయమైన మార్పులు చేయాలని సూచించింది. పీజీ ప్రవేశ పరీక్షలో ప్రస్తుతమున్న మల్టీపుల్‌ ఛాయిస్‌ క్వశ్చన్స్‌ వ్యవస్థను సమీక్షించాలని, మారుమూల గ్రామాల్లో వైద్యులు పనిచేసేలా చర్యలు చేపట్టాలని, వారికి అవసరమైన ప్రోత్సాహకాలు ఇవ్వాలని, సమర్థతను బట్టి వేతనాలు పెంచాలని స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ కాలేజీలను నెలకొల్పాలని, వైద్య పోస్టులను గణనీయంగా పెంచాలని, జిల్లాకొక నర్సింగ్‌ స్కూలును ఏర్పాటు చేయాలని, ఆరోగ్య రంగంలో అవినీతిని తరిమికొట్టాలని పిలుపునిచ్చింది.  

‘సమాజానికి తిరిగి ఇద్దాం’ నినాదంతో...
శ్రీమంతుడు సినిమాలో చెప్పినట్టుగానే గ్రామాల్లో వైద్య, ఆరోగ్య సేవలు అందించే వైద్యులను, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని కొత్త విధానం సూచించింది. ‘సమాజానికి తిరిగి ఇద్దాం’ నినాదంతో ముందుకు వచ్చే వైద్యులను గుర్తిం చాలని స్పష్టం చేసింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద ప్రైవేటు రంగం వైద్య, ఆరోగ్య సేవలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని, ముఖ్యంగా పాఠశాలలు, కాలనీలు, మురికివాడలు, గిరిజన ప్రాంతాలు సహా ఇతర వెనుకబడిన ప్రాంతాలను దత్తత తీసుకుని ఆరోగ్య సేవలు అందించేలా ప్రోత్సహించాలని పేర్కొంది.

కొత్త ఆరోగ్య విధానంలో కొన్ని కీలక లక్ష్యాలు
► మనిషి జీవిత కాలాన్ని 2025 నాటికి 67.5 నుంచి 70 ఏళ్లకు పెంచాలి.
► ఐదేళ్లలోపు పిల్లల మరణాలను 2025 నాటికి 23కు తగ్గించాలి. శిశుమరణాలను 2019కి 28కి తగ్గించాలి. నవజాత శిశు మరణాలను 16 నుంచి 2025 నాటికి ఒక అంకె స్థాయికి తగ్గించాలి.
► 2025కి ప్రజారోగ్య వసతులను ఉపయోగించుకునేవారి సంఖ్యను 50% పెంచాలి.
► పుట్టే పిల్లలు 90 శాతం ఆరోగ్యవంతంగా ఉండేలా 2025 నాటికి చర్యలు తీసుకోవాలి.

ఈ ఏడు అంశాలపై కార్యాచరణ
1. సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం, నిత్య వ్యాయామం
2. పొగాకు, మద్యానికి దూరంగా ఉండటం 3. రైలు, రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం 4. లింగ భేదాలు, హింసకు వ్యతిరేకంగా ప్రణాళిక 5. ఒత్తిడి తగ్గించడం, పని స్థలాల్లో భద్రత
6. వాయు కాలుష్యాన్ని తగ్గించడం 7. స్వచ్ఛభారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement