హైదరాబాద్ను మళ్లీ భయపెడుతున్న వర్షం!
తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వాసులను భారీ వర్షాలు మళ్లీ భయపెడుతున్నాయి. నగరంలో కొన్ని ప్రాంతాల్లో వరద బాధితులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి. కుకట్ పల్లి, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, ఎల్బీనగర్, జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, మియాపూర్ ఏరియాల్లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది.
ఖైరతాబాద్, లక్డీకపూల్, అబిడ్స్, కోఠి, దిల్సుఖ్ నగర్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, బేగంపేట్, బోయిన్ పల్లి లలో కూడా వర్షం పడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కురుస్తున్న ఈ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో నగరంలో రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జాం సమస్యలు తలెత్తాయి. నగరంలో కొన్ని ఏరియాలలో ఇప్పటికే వందలాది అపార్ట్ మెంట్ల సెల్లార్లలో భారీగా వరద నీరు చేరింది.
పలు కాలనీలు వరద నీటిలో చెరువులను తలపిస్తున్నాయి. నిజాంపేట బండారి లే అవుట్ గత రెండు రోజులుగా వరద నీటితోనే ఉంది. కొన్ని అపార్ట్ మెంట్లో అయితే రెండు రోజుల నుంచి తమ నివాసాల నుంచి కిందకి దిగి రోడ్డుపై కాలు కింద పెట్టకపోవడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సహాయక చర్యలు చేపడుతున్నా.. భారీ వర్షాల వల్ల నగరవాసులకు ఇక్కట్లు తప్పడం లేదు. రేపు కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.