ఎడతెరిపిలేని వర్షం: నగరం జామ్
హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్నవర్షంతో నగరంలో జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలోని కూకట్‌పల్లి మియాపూర్ మార్గంలో మంగళవారం ఉదయం నుంచే వాహనాల రాకపోకలు స్తంభించాయి. రహదారిపై పలుచోట్ల వర్షపునీరు నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈసీఐఎల్, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి.
కాచిగూడ బిగ్‌బజార్, మాసబ్ ట్యాంక్ కట్టమైసమ్మ ఆలయం, నాంపల్లి కంట్రోల్‌రూం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, టోలిచౌకి సూర్యనగర్ కాలనీ, తాజ్ ఐలాండ్ జంక్షన్, బేగంపేట్, లైఫ్‌స్టైల్, గ్రీన్ ల్యాండ్స్, పంజాగుట్ట క్రాస్ రోడ్, వైఎంసీఏ, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆఫీసులకు వెల్లే సమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
