సాక్షి, హైదరాబాద్: సాయంత్రం నాలుగు గంటలు. ఉన్నట్టుండి కమ్మేసిన దట్టమైన మబ్బులు.. ఇంతలోపే హోరున ఈదురు గాలులతో వర్ష బీభత్సం.. దాంతో ఎక్కడికక్కడ కూలిపోయిన విద్యుత్ స్తంభాలు.. రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్టు కొమ్మలు.. నేలకొరిగిన భారీ చెట్లు.. ఇదీ గురువారం సాయంత్రం భాగ్యనగరంలో గాలివాన సృష్టించిన అల్లకల్లోలం. మధ్యాహ్నం వరకు నిప్పులు కక్కిన సూర్యభగవానుడిని ఒక్కసారిగా మేఘాలు కప్పేశాయి. ఆకాశమంతా మేఘావృతమై చీకట్లు కమ్ముకొని కొద్దిసేపట్లోనే నగరమంతా భీకర గాలులతో వండగండ్లతో కూడిన భారీ వర్షం నగరాన్ని వణికించింది.
దక్షిణ కర్ణాటక నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితలద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, కూకట్‌పల్లితో పాటు రాం నగర్, ఓయూ, అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, సుల్తాన్‌బజార్, సికింద్రాబాద్, అల్వాల్, తిరుమలగిరి, మాదాపూర్, గచ్చిబౌలి, ఈసీఐఎల్, సైనిక్‌పురి, కుషాయిగూడ, నాచారం, దమ్మాయిగూడతో పాటు పలు ప్రాంతాల్లో భీకరగాలులతో కుండబోత వర్షం కురుస్తోంది. వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రానున్న మూడు రోజుల్లో గ్రేటర్ పరిధిలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో, మరికొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు ఇదివరకే హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ
భారీగా కురిసిన వర్షంతో రోడ్లపై విరిగిపడిన చెట్లను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాల్లో అత్యవసర బృందాలను పంపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో కి.మీల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ పక్క వర్షపు నీరు నిలబడటం, మరో పక్క మెట్రోరైలు పనుల కారణంగా ట్రాఫిక్ భారీగా స్తంభించింది.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment