జలదిగ్బంధంలోనే.. | heavy rain in hyderabad and so many issues | Sakshi
Sakshi News home page

జలదిగ్బంధంలోనే..

Published Sat, Sep 24 2016 2:19 AM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM

జలదిగ్బంధంలోనే.. - Sakshi

జలదిగ్బంధంలోనే..

⇒ హైదరాబాద్‌లో జనజీవనం అస్తవ్యస్తం

నగరంలో వర్షపాతం 7 సెం.మీ.
  ధ్వంసమైన రహదారులు 2,000 కి.మీ.
  సురక్షిత ప్రాంతాలకు తరలించిన కుటుంబాలు 200
  4 రోజుల్లో నమోదైన వర్షపాతం 30 సెం.మీ.
  కూలిన ఇళ్లు 33

 
 సాక్షి, హైదరాబాద్
 ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌లో జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వాటికి ఆనుకుని ఉన్న బస్తీలన్నీ నీటితో నిండిపోయాయి. దాదాపు రెండు వేల కిలోమీటర్ల పొడవైన రహదారులు దెబ్బతిన్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. శుక్రవారం కూడా కుండపోత వాన పడడంతో సహాయ చర్యలకూ ఆటంకం కలిగింది. తుర్కచెరువు ఉప్పొంగడంతో నిజాంపేట్‌లోని భండారి లేఅవుట్ ఇంకా చెరువును తలపిస్తోంది.
 
 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తంగా 6,111 కిలోమీటర్ల పొడవైన రహదారుల వ్యవస్థ ఉండగా.. భారీ వర్షాల కారణంగా సుమారు రెండు వేల కిలోమీటర్ల పొడవున రహదారులు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షపు నీరు నిలుస్తుండడంతో పలు చోట్ల ప్రధాన రహదారులు కూడా చెరువులను తలపిస్తున్నాయి. మూతల్లేని మ్యాన్‌హోల్‌ల వద్ద నీరు సుడులు తిరుగుతుండడంతో వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన మధ్య రాకపోకలు సాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం, సాయంత్రం సుమారు వంద జంక్షన్లలో ట్రాఫిక్ స్తంభించింది. హైదరాబాద్‌లో గత నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
 
 సాధారణం కంటే ఇది 200 శాతం అధికమని తెలిపింది. మొత్తంగా సెప్టెంబర్ 1 నుంచి 21వ తేదీ వరకు నగరంలో 72.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. ఇక అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్‌లో మరో 48 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా శుక్రవారం హైదరాబాద్ పరిధిలో 33 ఇళ్లు కూలిపోయాయి. పలుచోట్ల ఇళ్లలోకి నీరు చేరడంతో.. 200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారికి ఆహారం కూడా అందిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్‌కు వరదనీరు పోటెత్తుతోంది. సాగర్ గరిష్ట మట్టం వరకూ పూర్తిగా నిండిపోవడంతో.. వస్తున్న నీటినంతటినీ 18 స్లూయిజ్‌ల ద్వారా మూసీలోకి వదులుతున్నారు.
 
 జంట జలాశయాలకు జలకళ
 ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ (గండిపేట్)ల్లోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్‌సాగర్ గరిష్ట మట్టం 1763.5 అడుగులకుగాను శుక్రవారం సాయంత్రానికి 1738 అడుగులకు చేరింది. ఉస్మాన్‌సాగర్ గరిష్ట మట్టం 1790 అడుగులకుగాను 1770 అడుగులకు నీరు చేరింది. ఇదే స్థాయిలో వరద వస్తే మరో రెండు మూడు రోజుల్లోనే జలాశయాలు నిండుతాయని జల మండలి వర్గాలు తెలిపాయి.
 
 యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు: కేటీఆర్
 నాలుగు రోజులుగా వర్షం సృష్టించిన విలయం నేపథ్యంలో సహాయ చర్యలు చేపట్టేందుకు.. సైన్యాన్ని, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నామని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి ఆహారం, మంచినీరు, అత్యవసర మందులు అందజేస్తున్నామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ పదివేల భోజన ప్యాకెట్లను అందజేస్తోందని, ముంపు ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

వర్షపాతం వివరాలు  (గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు)
 పట్టణం             వర్షపాతం(సెం.మీ.)
చిన్నశంకరం పేట        21
 ధర్మసాగర్            18
 కంపాసాగర్            17
 లింగంపేట            15
 తాడ్వాయి            15
 ఘన్‌పూర్            14
 పిట్లం                  14
 నల్లగొండ            13
 సదాశివనగర్        13
 జుక్కల్                 13
 గాంధారి                13
 మిర్యాలగూడ        13
 ఖానాపూర్            13
 కొత్తగూడెం            13
 హన్మకొండ            12
 ఎల్లారెడ్డి                12
 మోమిన్‌పేట          12
 నర్మెట్ట                  12
 చెన్నారావుపేట      11
 నర్సంపేట              11
 నిజాంసాగర్            11
 నాగార్జునసాగర్        11
 మర్పల్లి                  11
 సంగారెడ్డి               11

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement