భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పురాతన పైపులైన్లు ధ్వంసమై అడుగుకో అగాథం ఏర్పడుతోంది.
⇒ ఎన్టీఆర్ మార్గ్ మధ్యలో భారీ అగాథం..
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పురాతన పైపులైన్లు ధ్వంసమై అడుగుకో అగాథం ఏర్పడుతోంది. బుధవారం ఓ వ్యక్తి బైక్‌పై ఎన్టీఆర్ గార్డెన్ ముందుకు రాగానే ముందు టైరు రోడ్డుపై చిన్న గోతిలో పడి ఆయన కిందపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ను పైకి లేపారు. ఆ తర్వాత అక్కడ చూడగా రోడ్డుపై చిన్న రంధ్రం కనిపించింది. బండరాయి పెడితే సరిపోతుందనుకున్నారు. కానీ కాసేపటికే ఆ గొయ్యి కాస్తా మృత్యుబిలంగా పెద్దయింది. లోపలికి చూస్తే వరద ఉధృతంగా ప్రవహిస్తోంది! సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ను పక్కకు మళ్లించారు. విషయం తెలుసుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
జేసీబీ సాయంతో రోడ్డును పైనుంచి తొలగించి చూడగా 6 మీటర్ల వెడల్పు, 25 అడుగుల లోతున మహాబిలం ఏర్పడింది. ఈ పైప్‌లైన్ మరమ్మతులకు వారంరోజుల సమయం పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. గతంలో పంజాగుట్ట, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్క్ వద్ద నాలాల పైన ఉన్న భూభాగం కుంగి భారీ అగాథాలు ఏర్పడ్డాయి. ప్రధాన నగరంలో సుమారు 40 నాలాలు భూగర్భం నుంచి ప్రవహిస్తుండగా.. సుమారు 1,500 కిలోమీటర్ల మేర వరదనీటి కాల్వ వ్యవస్థ ఉంది. వీటి ఉనికిని కచ్చితంగా పసిగట్టే టెక్నాలజీ జీహెచ్‌ఎంసీ, జలమండలికి వద్ద లేదంటే అతిశయోక్తి కాదు!