సూరీడు.. ‘మండే’స్తున్నాడు..
- రామగుండంలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత
- మరో రెండ్రోజులు తీవ్ర వడగాడ్పులు
- హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత మరింత పెరుగుతోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. సోమవారం రామగుండంలో అత్యధికంగా 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. మరో రెండురోజులపాటు వడగాడ్పులు కొనసాగుతాయని, అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వాన
ఉదయం, మధ్యాహ్నం ‘మండే’ ఎండ వేడిమి.. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై.. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అక్కడక్కడా చిరు జల్లులు.. హైదరాబాద్‌లో సోమవారం నెలకొన్న భిన్నమైన వాతావరణ పరిస్థితి ఇది. క్యుములోనింబస్ మేఘాల ఉధృతి, ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ జల్లులు కురిసినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో నగరంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. మధ్యాహ్నం గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బతో 72 మంది మత్యువాత
వడదెబ్బతో జనం పిట్టల్లా రాలుతున్నారు. తెలంగాణ జిల్లాల్లో వడదెబ్బ బారిన పడి ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు 72 మంది చనిపోయారు. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 17 మంది, కరీంనగర్ జిల్లాలో 14 మంది, ఖమ్మంలో 11 మంది, వరంగల్‌లో 10 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఐదుగురు మృత్యువాత పడగా, అందులో అడవిలో వడదెబ్బతగిలి నీళ్లు దొరకక మరణించిన ఇద్దరు చిన్నారులు, డ్రైవింగ్ సీటులోనే చనిపోయిన డ్రైవర్ ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో నలుగురు, మెదక్‌లో ముగ్గురు, నిజామాబాద్‌లో ఒకరు మరణించారు.
డ్రైవింగ్ సీటుపైనే ప్రాణాలు వదిలిన లారీ డ్రైవర్
ఇచ్చోడ : సరుకులు చేరవేసేందుకు రాష్ట్రం దాటి వచ్చిన ఓ లారీ డ్రైవర్ వడదెబ్బ బారిన పడి డ్రైవింగ్ సీటులోనే మృత్యువాతపడ్డాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ (కంటెరుునర్) డ్రైవర్ విష్ణుప్రసాద్ (35) లారీ లోడ్‌తో హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపునకు వెళ్తున్నాడు. సోమవారం మధ్యాహ్నమంతా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాడు. ఎండకు తోడు లారీ క్యాబిన్‌లో వేడి పెరగడంతో విష్ణుప్రసాద్‌కు వడదెబ్బ తగిలింది. లారీ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ బైపాస్ సమీపంలోకి రాగానే విష్ణుప్రసాద్ లారీని పక్కకు ఆపి.. సీట్లోనే పడిపోయి.. వాంతులు చేసుకున్నాడు. డ్రైవింగ్ సీటులోనే చనిపోయాడు. విషయంలో తెలియడంతో పోలీసులు వెళ్లి పరిశీలించారు. వాహనంలోని పత్రాలు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చే శారు. వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
సోమవారం ప్రధాన పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
ప్రాంతం ఉష్ణోగ్రత
రామగుండం 46.4
ఖమ్మం 44.4
భద్రాచలం 44.2
ఆదిలాబాద్ 44.2
హన్మకొండ 44.1
నల్లగొండ 43.8
నిజామాబాద్ 43.0
మెదక్ 42.4
హైదరాబాద్ 41.0