సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో వివిధ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఆవర్తనం శనివారం దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కర్ణాటక వరకు కొనసాగుతున్నట్లు వివరించింది. ఇది సముద్రమట్టం నుంచి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు వివరించింది.
రాష్ట్రంలోని ఉత్తర, తూర్పు ప్రాంత జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి.
రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో 38.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత, మెదక్‌లో 22.3 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
22న అల్పపీడనం..
ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఉత్తర ఈశాన్యం దిశగా ప్రయాణించి, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 24 నాటికల్లా వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. 25,26 తేదీల మధ్య ఇది తుపాను లేదా తీవ్ర తుపానుగా మారి విశాఖపట్నం – తూర్పు గోదావరి జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment