సీన్ కట్ చేస్తే..
డ్రగ్స్.. సమాజాన్ని కేన్సర్‌లా పీల్చిపిప్పిచేస్తున్న జబ్బు... హీరో ఈ డ్రగ్స్ మాఫియా అంతు చూస్తానని శపథం చేశాడు.. ఓ రోజు అర్ధరాత్రి తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు బ్యాట్‌మ్యాన్‌లా మారువేషం వేసుకున్నాడు.. డ్రగ్ మాఫియా డెన్‌లోకి అడుగుపెట్టాడు.. తలుపులు వేశాడు.. డిష్యూం.. డిష్యూం.. అరుపులు, కేకలు.. సామాన్లు ఎగిరి పడుతున్నాయి. అంతలోనే నిశ్శబ్దం..
హీరో స్టైల్‌గా బయటకి వచ్చాడు.. తన విజయానికి గుర్తుగా చిన్నసైజు బాంబును అలా వెనక్కి విసిరాడు.. పొగ కమ్ముకుంది..
హీరో మాయమయ్యాడు.. ఎప్పట్లాగే.. పోలీసులు లేట్‌గా సీన్‌లోకి ఎంటరయ్యారు.. హీరో చేతిలో చావు దెబ్బలు తిన్న ఇద్దరు విలన్లను కస్టడీలోకి తీసుకున్నారు.. హీరో మారువేషంలో విలన్ల ఆటకట్టించడం వంటి సీన్లు చాలా సినిమాల్లో చూశాం.. కానీ ఇది సినిమా సీన్ కాదు.. నిజంగానే జరిగిందట.. రష్యాలోని మాస్కో శివారు.. కిమ్కి ప్రాంతంలో.. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ట్యాక్సీ డ్రైవర్ ఈ మొత్తం సీన్‌ను వివరించాడు. ఈ ఘటన జూన్‌లో జరిగింది. అంతే.. ఒక్కసారిగా ఆ ముసుగు వ్యక్తి అక్కడ పాపులర్ అయిపోయాడు. కిమ్కి బ్యాట్‌మ్యాన్ అని పిలవడం ప్రారంభమైంది. రష్యాకు చెందిన ఓ పత్రిక ఈ విషయంపై పరిశోధన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సదరు ముసుగు వ్యక్తి పోలీసులకు రాసిన ఓ లేఖను సంపాదించింది. ఆ లేఖ ప్రకారం.. డ్రగ్‌మాఫియాతోపాటు స్థానిక నేరగాళ్లపై వన్‌మ్యాన్ ఆర్మీలా యుద్ధం చేస్తానని కిమ్కి బ్యాట్‌మ్యాన్ ప్రకటించాడు. తనను రీపర్-మానవత్వానికి మొదటి హీరో అని అభివర్ణించుకున్నాడు.
నేరసామ్రాజ్యాన్ని సమూలంగా నాశనం చేసేందుకు సాయం చేయాలని పోలీసులను కోరాడు. సోషల్ మీడియా ద్వారా తనకు సమాచారం అందించాలన్నాడు. ‘నే ను పోలీసులకు వ్యతిరేకం కాదు.. నాకు తెలుసు మీ చేతులు బంధించి ఉన్నాయి. సహచరుల వల్ల, నేరగాళ్ల వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్లలేరు. కానీ నేను అక్కడికి వెళ్లి.. వారి వ్యవస్థలను నాశనం చేస్తాను. నాకు పేరు ప్రఖ్యాతులు వద్దు. సమాచారం మాత్రమే కావాలి. నేరగాళ్లు, రేపిస్టులు, డ్రగ్స్ మాఫియాదారుల సమాచారం నాకు కావాలి’ అని లేఖలో పేర్కొన్నాడు. నేరగాళ్ల గురించి తనకు ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చంటూ ‘అపరిచితుడు’ సినిమా టైపులో తన ట్వీటర్ పేజీ అడ్రస్ కూడా తెలిపాడు. ఇప్పటివరకూ 40 మంది నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులకు సహకరించానని చెప్పాడు. ఈ కిమ్కి బ్యాట్‌మ్యాన్ ట్వీటర్ ప్రొఫైల్‌లోకి వెళ్తే.. ఓ డైలాగ్ మనల్ని ఆకర్షిస్తుంది.. అదేంటో తెలుసా? ‘‘ఆట మొదలైంది’’