ప్రచారాన్ని ఉధృతం చేయండి
► కార్బైడ్‌పై ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం
► మామిడి పళ్ల సీజనే సరైన సమయం
► పణాళికలను కాగితాలకే పరిమితం చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: మామిడి పళ్ల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కార్బైడ్ వినియోగం వల్ల కలిగే దుష్ర్పభావాలపై ప్రచారాన్ని మరింత ఉధృతం చేయాలని హైకోర్టు సోమవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే పండ్ల వ్యాపారులు కార్బైడ్ వినియోగించకుండా విస్తృతస్థాయిలో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఒకే సమయంలో ప్రచారం, తనిఖీలు చేపట్టాల్సిన తరుణం ఇదేనని రెండు రాష్ట్రాలకు సూచించింది. కార్బైడ్ నిరోధానికి కోర్టు ముందుంచిన కార్యాచరణ ప్రణాళికలను కాగితాలకే పరిమితం చేయవద్దని, వాటిని సమర్థవంతంగా ఆచరణలోకి తీసుకురావాలని పేర్కొంది.
తదుపరి విచారణను వేసవి సెలవుల తరువాత చేపడుతామంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పండ్ల వ్యాపారులు కాయలను పక్వానికి తీసుకొచ్చేందుకు కార్బైడ్ వినియోగిస్తున్న తీరుపై పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజా ప్రయోజ న వ్యాజ్యం (పిల్)గా పరిగణించి విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దానిని మరోసారి విచారించింది. ఈ సందర్భంగా అమికస్ క్యూరీ (కోర్టు సహాయకులు) ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ హైకోర్టు పర్యవేక్షణ వల్ల కొంత ఫలితం ఉందన్నారు.
మామిడి పళ్ల సీజన్ ప్రారంభం కాబోతోందని, ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టేందుకు ఇదే సమయమన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవిస్తూ కార్బైడ్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని ఉధృతం చేయాలంది. ఈ ప్రచారానికి రేడియోనూ ఉపయోగించుకోవాలని ఇరు రాష్ట్రాలకు స్పష్టం చేస్తూ తదుపరి విచారణను వేసవి తర్వాత చేపడతామని తెలిపింది.