మామూళ్ల వసూలు సాధారణమైపోయింది!
ఇంజనీరింగ్, పలు శాఖల్లో అవినీతిపై హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తదితర శాఖల్లో అవినీతి పెరిగిపోతుండటం పట్ల ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బిల్లుల ప్రాసెసింగ్‌కు మామూళ్ల వసూలు చాలా సాధారణ వ్యవహారంగా మారిపోయిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. మామూళ్లను పర్సంటేజీల ప్రకారం వసూలు చేస్తున్నారని, ఒక్కోసారి అది పని అంచనా వ్యయంలో 10 నుంచి 15 శాతం వరకు కూడా వెళుతోం దని తెలిపింది. ఇది తమకు సైతం అనుభవమేనని, కోర్టుల్లో పనులకు సంబంధించిన అంచనాలు కొన్ని సందర్భాల్లో భారీగా పెంచిన సందర్భాలు అనేకం ఉన్నాయని వివరించింది.
మామూళ్లు డిమాండ్ చేసిన ఇంజనీర్లపై ఓ కాంట్రాక్టర్ రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన ఉన్నతాధికారులు నెలల తరబడి మిన్నకుండిపోవడంపై విస్మయం వ్యక్తం చేసింది. 2010 నుంచి ఆ కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన రూ.4.48 లక్షలను 6 శాతం సాధారణ వడ్డీతో 8 వారాల్లోగా చెల్లించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ ఇటీవల తీర్పు వెలువరించారు.
బిల్లులు చెల్లించకపోవడంతో..
కాకతీయ కాలువలో మట్టి తీయడంతో పాటు మరో పని నిమిత్తం నీటిపారుదలశాఖ అధికారులతో కరీంనగర్ జిల్లా, కందుగుల గ్రామానికి చెందిన ఎం.రాజిరెడ్డి 2009లో 60 రోజుల్లో పూర్తి చేసేలా ఒప్పందం చేసుకున్నారు. అనుకున్న మేరకే పనులు పూర్తి చేసినప్పటికీ బిల్లులు చెల్లించకపోవడంతో రాజిరెడ్డి 2011లో హైకోర్టును ఆశ్రయించారు.