45 రోజులుగా నిలిచిన గుడ్ల సరఫరా
అంగన్‌వాడీల ఇబ్బందిని హైకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చిన సర్కార్
హైదరాబాద్: నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ(నెక్) సర్టిఫికెట్ కోసం ఒత్తిడి చేయకుండా టెండర్ల ప్రక్రియ నిర్వహించాలంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్రంలో 45 రోజులుగా అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా నిలిచిపోయిందని పేర్కొంది. చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. అందువల్ల తమ అప్పీల్‌పై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేకన్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో సోమవారమే ఈ అప్పీల్‌పై విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్లు సరఫరా చేసేందుకు ప్రభుత్వం గత నెల 16న టెండర్ నోటీసు జారీ చేసింది. గుడ్ల సరఫరాకు నెక్ సర్టిఫికెట్ తప్పనిసరని అధికారులు నిబంధన పెట్టారు. దీనిని సవాలు చేస్తూ శ్రీ వెంకటేశ్వర ఇండస్ట్రీస్, మరో 4 సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై సింగిల్ జడ్జి జస్టిస్ సురేశ్ కైత్ విచారణ జరిపి పిటిషనర్లను టెండర్ ప్రక్రియలోకి అనుమతించాలని, అప్పటివరకు టెండర్లను తెరవొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి తదితరులు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరగా.. సోమవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.