బతికున్న రైతులను చనిపోయినట్లు చూపుతారా?
పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం విచారణ 2 వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : బతికున్న రైతులను చనిపోయినట్లు చూపి ఆ జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని వారికి సూచిం చింది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం తిరస్కరించడానికి గల కారణాలను వెల్లడించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటి వివరాలను పిటిషనర్లకు అందజేయాలంటూ విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రైతుల ఆత్మహత్యల నివారణకు ఉభయ రాష్ట్రాలు ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేయడంతోపాటు స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమ లు చేసేలా ఆదేశించాలని వ్యవసాయ జనచైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్, తెలంగాణలో రూ. లక్ష వరకు రైతులు తీసుకున్న పంట, బంగారు రుణాలను వన్‌టైం సెటిల్‌మెంట్ కింద మాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహా రెడ్డి, మరొకరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ప్రొఫెసర్ కోదండరాం అనుబంధ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్ స్పందిస్తూ బతికున్న వారిని కూడా చనిపోయినట్లు పిటిషనర్లు చూపారని, వారు ఇచ్చినజాబితాలో ఆరుగురు బతికే ఉన్నారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ధర్మాసనం పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది.