పరిహారం వల్ల ప్రయోజనమేంటి?
♦ రైతుల ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
♦ బలవన్మరణాల నివారణకు విస్తృత ప్రచారం నిర్వహించండి
♦ ఉభయ రాష్ట్రాలకు హైకోర్టు స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: రైతులు ఆత్మహత్య చేసుకున్న తరువాత పరిహారం అందించడం వల్ల ప్రయోజనం ఉండదని, అసలు ఆత్మహత్యలు జరగకుండానే చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో రైతులకు చేరినప్పుడే బలవన్మరణాలు ఆగుతాయని, ఆ దిశగా గట్టి చర్యలు చేపట్టాలని సూచించింది. అన్నదాతల ఆత్మహత్యలను నివారించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని, పత్రికలు, టీవీల్లో పెద్దఎత్తున ప్రకటనలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అలాగే ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి మరో వారం గడువునిచ్చింది.
ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. రైతుల ఆత్మహత్యల నివారణకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ వ్యవసాయ జన చైతన్య సమితి అధ్యక్షుడు రామయ్యయాదవ్ సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం లో తమనూ ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ ప్రొఫెసర్ కోదండరాం అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకొనేలా ఆదేశించాలని కోరుతూ మెదక్ జిల్లాకు చెందిన పాకాల శ్రీహరి, హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దొంతిరెడ్డి నర్సింహారెడ్డి, మరొకరు ఇప్పటికే హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటినీ ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ పి.వేణుగోపాల్ వాదనలు వినిపిస్తూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందచేస్తున్నామని చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. సాయం కంటే ఆత్మహత్యల నివారణే ముఖ్యమని పేర్కొంది.
ప్రొ. కోదండరాం తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. దేశంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో కరువు మండలాలను ప్రకటించాయని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు కరువు మండలాలను ప్రకటించలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ స్పం దిస్తూ... పిటిషనర్ల వాదనలు వాస్తవ దూరమని, పూర్తి వివరాలతో ప్రాథమిక కౌంటర్‌ను సిద్ధం చేశామని తెలిపారు. అయితే, పూర్తిస్థాయి కౌంటర్‌ను తమ ముందుంచాలని శరత్‌కు ధర్మాసనం స్పష్టం చేస్తూ విచారణను 23కు వాయిదా వేసింది.