ఓటుకు కోట్లు కేసు: తీర్పు వాయిదా
ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ఇప్పటికి పలు దఫాలుగా ఈ కేసులో వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే ఆర్కే తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మధ్యలో ఈ కేసులో చంద్రబాబు పాత్రపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా తన వాదనలు వినిపించారు. మొత్తానికి ఈ కేసులో వాదనలు మంగళవారంతో ముగిసినట్లు హైకోర్టు ప్రకటించి, తీర్పును వాయిదా వేసింది. త్వరలోనే దీనిపై తుది ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
అసలు ఎమ్మెల్యే ఆర్కేకు ఈ కేసు దాఖలుచేసే అర్హత (లోకస్ స్టాండీ) లేదన్న అంశం మీదనే ప్రధానంగా చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. బాధ్యత గల పౌరునిగా కేసు దాఖలు చేసినట్లు ఆర్కే తరఫు న్యాయవాది చెప్పారు. ఏసీబీ కోర్టు కూడా చంద్రబాబు మీద కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును విచారించాలని చెబుతుందా.. లేదా అనే విషయమై ఉత్కంఠ నెలకొంది.