
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బోజగుట్టలో 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంపై గతంలో ఉన్న ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. ఆ భూముల్లో చట్ట వ్యతిరేకంగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని ఆరోపిస్తూ ఎంఎస్ ముస్తఫాహిల్స్ కోఆపరేటివ్ సొసైటీ దాఖలు చేసిన కేసులో గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు, అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం సవరించింది.
సొసైటీకి చెందిన ఆరు ఎకరాల్లో కూడా ఇళ్ల నిర్మాణం చేస్తున్నారని పిటిషనర్ ఆరోపణ. ఈ కేసులో జీహెచ్‌ఎంసీ తరుఫున తెలంగాణ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్‌రావు వాదిస్తూ సొసైటీ భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించామని తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ మిగిలిన భూములపై హద్దులు నిర్ణయించి సింగిల్ జడ్జి వద్ద నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.