హెచ్‌ఎండీఏకు పునరుజ్జీవం
సాక్షి, సిటీబ్యూరో : ఆర్థిక సమస్యలతో అతలాకుతలమవుతున్న హెచ్‌ఎండీఏ పునరుజ్జీవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)ను గాడిలో పెట్టేందుకు సంస్థలో సమూలమార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. హెచ్‌ఎండీఏలో ఏ అనుమతి కావాలన్నా ఆన్‌లైన్ ద్వారా పొందే విధంగా సరికొత్త వ్యవస్థను అందుబాటులోకి తెస్తూ తాజాగా చర్యలు చేపట్టారు. దీనివల్ల ప్రజలకు సత్వర సేవలు అందడంతో పాటు అక్రమార్కుల ఆగడాలకు అడ్డుకట్టవేస్తూ ‘ఆన్‌లైన్ అప్రూవల్’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు.
సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న అధికారులందరిపై ఒకేసారి బదిలీ వేటు వేశారు. అలాగే అవినీతి, అక్రమాలకు పావులుగా ఉపయోగపడుతున్నారన్న ఆరోపణలతో సుమారు 200 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఏకకాలంలో తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. అవినీతి ఆరోపణలతో ఉద్వాసనకు గురైన కమిషనర్ నీరభ్‌కుమార్ హయాంలో ఇచ్చిన వివిధ అనుమతులను నిలుపుదల చేస్తూ వాటిపై విచారణకు ఆదేశించారు. భూ వినియోగమార్పిడితో పాటు ఐటీ సంస్థలు, పరిశ్రమలు తదితరాలకు కీలకమైన అనుమతులన్నీ ఇకపై ప్రభుత్వం నుంచే ఇచ్చేలా సమూలంగా మార్పులు చేశారు.
కొత్త ప్రాజెక్టులివీ
గత ఏడాది కాలంలో హెచ్‌ఎండీఏకు కొత్తగా భారీ ప్రాజెక్టులు అప్పగించకపోయినా... ఈసీ నదిపై కిస్మత్‌పూర్ వద్ద వంతెన నిర్మించేందుకు రూ.6.6 కోట్లు సీఎం మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి పరిపాలనాపరమైన అనుమతి కూడా రావడంతో టెండర్లు పిలిచేందుకు హెచ్‌ఎండీఏ ఇంజనీరింగ్ విభాగం సన్నాహాలు చేస్తోంది.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకమైన ఔటర్ రింగ్ రోడ్డు వెంట పచ్చదనాన్ని పెంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. ప్రధానంగా హెచ్‌ఎండీఏ పరిధిలో పచ్చదనాన్ని అభివృద్ధి చేసేందుకు ‘హరిత హారం’ పథకం కింద రూ.50 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.20 కోట్లు నిధులు విడుదల చేస్తూ చర్యలు తీసుకొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్, బీపీఎస్ పథకాలను పునః ప్రారంభించడం ద్వారా హెచ్‌ఎండీఏకు ఆర్థిక జవసత్వాలు కూడగట్టుకొనే వెసులబాటు కల్పించేదిశగా సీఎం అధికారులతో సమాలోచనలు చేస్తున్నారు.
భవిష్యత్ నగరాభివృద్ధిలో హెచ్‌ఎండీఏ కీలకపాత్ర పోషించేలా మాస్టర్‌ప్లాన్ అమలు, ఐటీఐఆర్ మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను ప్రత్యేకంగా మహానగరాభివృద్ధి సంస్థకు అప్పగించారు.