లక్ష్యాన్ని.. గురిచూసి కొట్టాలంటే.. | how to target reach | Sakshi
Sakshi News home page

లక్ష్యాన్ని.. గురిచూసి కొట్టాలంటే..

Published Wed, Jul 1 2015 7:38 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

లక్ష్యాన్ని.. గురిచూసి కొట్టాలంటే..

లక్ష్యాన్ని.. గురిచూసి కొట్టాలంటే..

‘నేను చాలా డబ్బు సంపాదించాలి’
‘నేను మంచి ఉద్యోగంలో చేరాలి’
‘నేను ఉన్నత స్థానంలో ఉండాలి’..
ఇవన్నీ లక్ష్యాలు కావు.. కేవలం కలలు మాత్రమే.

అయితే ఒక కలను లక్ష్యమని చెప్పుకోవాలంటే దానికి ఏమి ఉండాలి? దీనికి సమాధానాన్ని 5-డి సూత్రం ద్వారా తెలుసుకోవచ్చు.
 
1. ఆశయం
2. దిశ
3. సంకల్పం
4. క్రమశిక్షణ
5. తుది గడువు

 
మీ ఆశయాలకు మిగిలిన 4-డిలు జతకలిస్తేనే ఆ కలలు లక్ష్యాలు (గోల్స్) అవుతాయి. ఇలాంటి లక్ష్యాలున్న వ్యక్తి అసలైన విజేతగా నిలుస్తాడు. మీ కలలో ఈ ఐదు అంశాల్లో ఏది లోపించినా అది గోల్ కాదు.. ఉత్త కల మాత్రమే!
 
అపనమ్మకమే అసలు అడ్డంకి...
మీ లక్ష్యం గురించి చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారా? మొహమాట పడుతున్నారా? అయితే మీరిలా ఆలోచిస్తూ ఉండవచ్చు.
‘ఒకవేళ నేను నా లక్ష్యాన్ని సాధించలేకపోతే ఎదుటి వారు నవ్వుకుంటారేమో’! అంటే మీ విజయం పట్ల మీరు వంద శాతం నమ్మకంగా లేరు. మీరు మానసికంగా మీ విజయాన్ని శంకించకండి.. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ (ఎన్‌ఎల్‌పీ) సాధనలో ఇది ముఖ్య సూత్రం. ప్రపంచ వ్యాప్తంగా అనేక సంచలనాలు సృష్టిస్తున్న ‘ది సీక్రెట్’ అనే పుస్తకం ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. నిర్హేతుకమైన, అసాధారణమైన, అసాధ్యమైన కలల్ని సైతం పదే పదే బలంగా అనుకుంటే మీ మనసు వాటిని సాధించేందుకు ఉరకలేస్తుంది.. మీ కలలు నూటికి నూరుశాతం ఫలిస్తాయని ఈ పుస్తకం చెబుతోంది. అందుకే 5-డి తో కూడిన మీ స్పష్టమైన లక్ష్యం తాలూకు విజయావకాశాలను మీరు బలంగా విశ్వసించండి.. విజయం మీ సొంతమవుతుంది.

‘నా జీవిత గమ్యం ఇది’ అని మొదటే బలంగా అనుకొని, సరైన దిశలో, సరైన సంకల్పం, క్రమశిక్షణతో ముందుకెళ్తే మీరు ముందే నిర్దేశించుకున్న గడువులోగా లక్ష్యాన్ని తప్పక సాధిస్తారు. ఇదే అసలైన లక్ష్య నిర్దేశం!
 
అద్దం ఎంత స్పష్టంగా, ఎలాంటి మరకలు లేకుండా ఉంటే అందులో మన ప్రతిబింబం అంత స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా మన లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే దాన్ని సాధించేందుకు అవసరమైన మార్గాలు అంతే స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తాయి.
 
లక్ష్యాలు- రకాలు
1 స్వల్పకాలిక లక్ష్యాలు (ఏడాదిలో సాధించాల్సినవి)
2 మధ్యకాలిక లక్ష్యాలు (మూడేళ్లలో సాధించాల్సినవి)
3 దీర్ఘకాలిక లక్ష్యాలు (ఐదేళ్లలో సాధించాల్సినవి)

ఈ విధంగా ఒక పెద్ద లక్ష్యాన్ని, చిన్న లక్ష్యాలుగా విడగొట్టొచ్చు. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంటే, లక్ష్య సాధన అంత తేలికవుతుంది. ఎప్పుడైతే ఇలా మీ లక్ష్యానికి సంబంధించి స్పష్టత ఉంటుందో అప్పుడు దాన్ని సాధించడానికి అవసరమైన సాఫ్ట్ స్కిల్స్, హార్డ్ స్కిల్స్ ఏమిటో మీకు తెలిసిపోతుంది. వాటిని సాధించే క్రమంలో మీకు తక్షణ లక్ష్యాలు, మధ్యకాలిక లక్ష్యాలు, సుదూర లక్ష్యాలు వాటంతటవే వరుస క్రమంలో (ప్రాధాన్యత క్రమంలో) మీ ముందు ప్రత్యక్షమవుతాయి. 5-డి సూత్రాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తూ ముందుకెళ్తుంటే తక్షణ లక్ష్యాలు ఎప్పటికప్పుడు నెరవేరుతుంటాయి. ఈ విజయాలు మనల్ని తొలుత మధ్యకాలిక లక్ష్యాలకు, తర్వాత దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు దగ్గర చేస్తాయి.విజేత జేబులో ఎప్పుడూ ‘థింగ్స్ టు డు టుడే’ అనే పాకెట్ సైజ్ పుస్తకం ఉంటుంది. అందులో ఆరోజున చేయాల్సిన పనులు (తక్షణ లక్ష్యాలు) రాసుకుంటారు. ఒక్కో పని పూర్తవుతుంటే టిక్ చేస్తారు. ప్రతి టిక్ మార్‌‌క వారికి కొత్త ప్రేరణ ఇస్తుంది.  -వివేకానంద్.ఆర్, డెరైక్టర్, రాయల్ స్పోకెన్ ఇంగ్లిష్ అకాడమీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement