వందేళ్లనాటి తెలంగాణ ‘చిత్రం’..
పురావస్తు శాఖ స్టోర్‌రూమ్‌లో వేల సంఖ్యలో ఛాయా చిత్రాలు
అరుదైన ఫీల్డ్ కెమెరాతో తీసిన తొలితరం గ్లాస్ నెగెటివ్‌లు లభ్యం
విలువైన ఫొటోలను వెలుగులోకి తేవాలని అధికారుల నిర్ణయం
ఈనెల 19న కొన్ని ప్రదర్శనకు
హైదరాబాద్: వందేళ్ల క్రితం.. తెలంగాణ ప్రజల జీవనం ఎలా ఉండేది.. భాగ్యనగర సామాజిక పరిస్థితి ఏంటి.. మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయం అహల్యాబాయి మందిరం వద్ద జాతర ఎలా సాగింది.. ఆధునిక దేవాలయాలుగా భాసిల్లుతున్న ప్రధాన ప్రాజెక్టులు కట్టకముందు ఆ ప్రాంతాల రూపురేఖలు ఎలా ఉన్నాయి.. అప్పట్లో నిజాం దర్పం ఎలా ఉండేది.. కర్ణాటక, ఒరిస్సాలోని దక్కన్ పరిధి ప్రాంతాల్లో ప్రజల జీవన చిత్రమేంటి..?
వందేళ్ల నాటి హైదరాబాద్ సంస్థానం పరిధిలోని ప్రజల జీవనం, ఈ ప్రాంతాల రూపు, నాటి క ట్టడాల సొగసు, ఒకటేమిటి.. ఎన్నో అద్భుత ఛాయా చిత్రాల ఖజానా అది. ఒకటి రెండు కాదు.. ఏకంగా 4,800 ఫొటోలు దాని సొంతం. అప్పుడు హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఛాయాచిత్రాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కూడా లేవు. వాటి కోసం ఆ ప్రభుత్వాలు అన్వేషిస్తున్నాయి. అయితే అలాంటి అరుదైన ఫొటోల ఖజానా తెలంగాణ పురావస్తు శాఖలో నిక్షిప్తమై ఉంది. ఇన్ని దశాబ్దాల పాటు స్టోర్‌రూమ్‌లో మగ్గిన ఆ చిత్రాలను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దుమ్ముదులిపి వెలుగులోకి తెస్తోంది. ఎప్పుడో అంతరించిపోయిన తొలితరం ఫీల్డ్ కెమెరాతో తీసిన గ్లాస్ నెగెటివ్స్ రూపంలో ఇవి ఉండటం మరో విశేషం.
అవన్నీ స్టోర్ రూమ్‌లో..
ప్రపంచ దిగ్గజ ఫొటోగ్రాఫర్‌గా ఖ్యాతి పొందిన రాజా దీన్‌దయాళ్ ప్రత్యేకంగా నిజాం ఆస్థాన ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన కాలంలో ఎన్నో అద్భుతాలను ఛాయాచిత్రాల రూపంలో భావితరాలకు అందించారు. ఆయనతోపాటు మరికొందరు ఫీల్డ్ కెమెరాను వినియోగించి తీసిన ఫొటోల తాలూకు గ్లాస్ నెగెటివ్స్ ప్రస్తుతం పురావస్తు శాఖ స్టోర్ రూమ్‌లో ఉన్నాయి. ఏదైనా చిత్రాన్ని పెద్దదిగా చూడాలంటే రిజల్యూషన్ దెబ్బతిని చిత్రంలో స్పష్టత తగ్గుతుంది. కానీ వందేళ్ల క్రితం తీసిన ఈ చిత్రాల గ్లాస్ నెగెటివ్స్‌ను డెవలప్ చేయగా.. అద్భుతమైన స్పష్టతతో ఉండటాన్ని చూసి అధికారులే అవాక్కయ్యారు.
19న కొన్ని ప్రజల ముంగిటకు
ఈనెల 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం కావటంతో ఈ గ్లాస్ నెగెటివ్స్ లోంచి 30 చిత్రాలను డెవలప్ చేసి, డాక్టర్ వైఎస్సార్ స్టేట్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచాలని అధికారులు నిర్ణయిం చారు. దీంతోపాటు అల నాటి ఓ కెమెరాను కూడా ప్రదర్శించనున్నారు. నేటి తరానికి నాటి గ్లాస్ నెగెటివ్ విధానం, ఫీల్డ్ కెమెరా పనితీరును ప్రత్యక్షంగా చూపించాలని నిర్ణయించినట్టు పురావస్తు శాఖ సంచాలకులు విశాలాక్షి ‘సాక్షి’తో చెప్పారు.
వేలంలో తుక్కు కింద అమ్మేశారు...
వందేళ్ల నాటి వస్తువులంటే కంటికిరెప్పలా కాపాడి భావితరాలకు అందించాలి. కానీ మన ఘనమైన పురావస్తు శాఖ అధికారులేం చేశారో తెలుసా.. అలనాటి పురాతన ఫీల్డ్ కెమెరాలు, వాటి పరికరాలను తుక్కు కింద భావించి వేలంపాటలో అమ్మేసుకున్నారు. దీంతో నాటి కెమెరాలు, ఇతర వస్తువులు పురావస్తు కార్యాలయంలో లేకుండా పోయాయి. అప్పట్లో ఆ శాఖలో పనిచేసిన ఓ ఫొటో గ్రాఫర్ రూ.250 చెల్లించి వేలంలో ఓ కెమెరా కొనుక్కున్నాడు. అలా ఆ ఒక్క కెమెరా మాత్రమే నేటి తరం చూసేందుకు మిగిలి ఉంది. దాన్నే తాజా ప్రదర్శనలో ఉంచబోతున్నారు.