గులాబీ దళం సందడి
నాంపల్లి: టీఆర్‌ఎస్ ప్లీనరీతో శుక్రవారం హైదరాబాద్‌లో సందడి నెలకుంది. తెలంగాణ జిల్లాల నుంచి సుమారు 15 వేల మంది హాజరై ఉంటారని పోలీసు ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. నాయకుల ప్రసంగాలను వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లు, లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేశారు. సభలో కూలర్లు, ఫ్యాన్లు అమర్చారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన ప్లీనరీ గంట ఆలస్యంగా ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ 12 గంటలకు స్టేడియానికి చేరుకున్నారు. ఆయన అందరికి అభివాదం చేయడంతో కార్యకర్తలు పెద్ద పెట్టున జై తెలంగాణ నినాదాలు చేశారు.
ఎల్బీ స్టేడియం చుట్టూ వెలసిన ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు కనువిందు చేశాయి. టీఆర్‌ఎస్ పార్టీకి అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించడంతో ఎల్బీ స్టేడియం వద్ద భారీగా బాణసంచా పేల్చారు. కార్యకర్తలకు మాంసాహారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. వంటకాలు సరిపోక వారు కిందా మీద పడ్డారు. నాయకులు ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కొత్తగా హామీలేమీ ప్రకటించకపోవడం విశేషం. సాయంత్రం 6.50 గంటలకు ప్లీనరీ ముగిసింది. హాజరైన ప్రతి కార్యకర్తకు టీఆర్‌ఎస్ పార్టీ హ్యాండ్ బ్యాగ్‌లను పంపిణీ చేసింది.
గన్‌పార్క్‌వైపు చూడని నేతలు..
తెలంగాణ అమరవీరుల స్థూపం (గన్‌పార్క్) వద్దకు ఏ ఒక్క నాయకుడూ రాలేదు. గన్‌పార్క్ చుట్టూ బ్యానర్లు, కేసీఆర్ హోర్డింగ్‌లతో ముంచెత్తారే తప్పా స్థూపాన్ని పూలతో అలంకరించలేదు. అమరులకు ఎల్బీస్టేడియంలో నివాళులర్పించిన నాయకులు, గన్‌పార్క్ వద్దకు మాత్రం రాలేదు. నేతలు గన్‌పార్క్ వద్దకు వస్తారని ఎంతగానో ఎదురుచూసిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. వారు ఎల్బీస్టేడియానికి చేరుకోకతప్పలేదు.
నగరం గులాబీ మయం..
ఎల్బీ స్టేడియం బయట, నిజాం కళాశాల, గన్‌ఫౌండ్రీ రోడ్, ఎంజే మార్కెట్, నాంపల్లితో పాటు పలు ప్రాంతాలు టీఆర్‌ఎస్ జెండాలు, బ్యానర్లతో గులాబీమయమయ్యాయి. స్థానిక నాయకులతో పాటు రాష్ట్ర నాయకుల వరకూ పోటాపోటీగా బ్యానర్లను ఏర్పాటు చేశారు.