విశ్వనగరంగా రాజధాని : కేసీఆర్
⇒ మరో రింగ్‌రోడ్డు, విమానాశ్రయాల నిర్మాణం
⇒ మెట్రో రైలు మార్గం విస్తరణ
⇒ నగరంలో వెయ్యి కూరగాయల మార్కెట్లు
⇒ టీఆర్‌ఎస్ ప్లీనరీలో తీర్మానం
సాక్షి,సిటీబ్యూరో: టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదిక సాక్షిగా గ్రేటర్ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దనున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ‘విశ్వనగరంగా హైదరాబాద్’ అన్న తీర్మానాన్ని కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య ఆమోదించారు.
మెట్రో రైలు మార్గాలను భవిష్యత్తులో శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం, బీహెచ్‌ఈఎల్ (రామచంద్రాపురం), ఇబ్రహీంపట్నం వరకు పొడిగిస్తామని సీఎం ప్రకటించారు. కోటి జనాభాకు చేరువైన మహా నగరంలో వెయ్యి కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. వర్షం పడితే హైదరాబాద్‌లో కార్లు పడవ లు అవుతున్నాయని... ఈ పరిస్థితికి గత పాలకులే కారణమని విమర్శించారు. ఇది ఏ హైటెక్ పాలనకు నిదర్శనమని విపక్షాలను దెప్పిపొడిచారు.
నాలాల కబ్జాతో పాటు కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల కాలం నాటి మురుగునీరు, వరదనీటి కాల్వల వ్యవస్థను గత పాలకుల హయాంలో ధ్వంసం చేశారని ఆక్షేపించారు. నగరంలోని శ్మశాన వాటికలను సైతం అన్ని వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందిరాపార్క్ సమీపంలో 14 ఎకరాల విస్తీర్ణంలో కళాభారతిని ఏర్పాటు చేస్తామన్నారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన పూర్తి చేస్తామని... నగరంలో మౌలిక వసతులు కల్పిస్తామని సీఎం చెప్పారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ. నగరంలో స్కైవేల నిర్మాణానికి ముంబయికి చెందిన ఓ ప్రైవేటు సంస్థ రూ.20 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ప్రసంగంలో నగరం ఐటీ హబ్‌గా మారుతుందని తెలిపారు.
‘విశ్వనగరం’ తీర్మాన సారాంశం...
‘శతాబ్దాల చరిత్ర కలిగిన హైదరాబాద్... అన్ని జాతులు, మతాలు, భాషా సంస్కృతుల సహజీవన కేంద్రం. కాస్మోపాలిటన్ సిటీ. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో నగరం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. సమశీతోష్ణ వాతావరణం, ప్రకృతి విపత్తులు సంభవించని పర్యావరణం ఈ నగరం సొంతం. అసఫ్‌జాహీల కాలంలోనే హైదరాబాద్ ఆధునిక నగరంగా అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఐటీఐఆర్ తో నగరం రెండింతలు విస్తరించే అవకాశం ఉంది.
ట్రాఫిక్ నియంత్రణకు మల్టీ గ్రేడ్ సెపరేటర్స్, సూపర్ స్కైవేలు, జంక్షన్ల అభివృద్ధి, సిగ్నల్ ఫ్రీ కారిడార్లు, వేగ నియంత్రణకు స్పీడ్ గన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి అంతర్జాతీయ నగరంగా తీర్దిదిద్దేందుకు ప్రభుత్వం సమగ్ర పథకం రూపొందించింది. శాటిలైట్ సిటీల నిర్మాణం, పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, మూసీనది ప్రక్షాళన, హుస్సేన్‌సాగర్ శుద్ధి, వాటర్‌గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని సరఫరా చేయడం, మెట్రో రైలు మార్గం ద్వారా ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచడం వంటివన్నీ ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు.
వీటితో పాటు నగరం చుట్టూ మరొక రింగ్‌రోడ్డును నిర్మించడం, ఇంకోవిమానాశ్రయం ఏర్పాటు, ఎన్టీఆర్ స్టేడియం లో కళాభారతి ఏర్పాటు, నగరంలో పచ్చదనం పెం చేందుకు హరితహారం చేపడతామని తీర్మానంలో పేర్కొన్నారు. కాలుష్య నివారణ, అక్రమ నిర్మాణా లు, ప్రభుత్వ స్థలాల కబ్జాలను నిలువరించడం ప్ర భుత్వం ముందున్న సవాళ్లని తెలిపారు. వీటిని ఎదుర్కొని పరిష్కరించేందుకు ప్రభుత్వం దృఢ చిత్తంతో ప్రణాళికను ప్రారంభించాలి. అమలుకు చర్యలు చేపట్టాలి. విశ్వనగరంగా హైదరాబాద్‌కు ప్రఖ్యాతి తీసుకురావాల’ని ఈ సభ తీర్మానిస్తున్నది.