ఆయన 'పంచ్' వేస్తే..
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్... ప్లీనరీలో తనదైన శైలిలో పడికట్టు పదాలతో, పంచ్ డైలాగులతో సభకు హాజరైనవారిని ఆకట్టుకున్నారు.
* రాష్ట్రంలో కోతుల బెడద అధికంగా ఉన్న నేపథ్యంలో 'కోతులుండే జాగాను మనం ఖరాబు చేస్తే.. మనం ఉండే జాగాలకచ్చి అవి మన పంటలను ఖరాబు చేస్తున్నాయి. అందుకే ప్రతి గ్రామంలో వేలాదిగా చెట్లు నాటాలి..'అని సూచించారు.
* కరెంట్ కోతలపై విపక్షాలు అసెంబ్లీలో ఆందోళన చేసిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. 'మేం అధికారం చేపట్టి గోచిగూడా సర్దుకోకముందే ఆందోళన చేస్తున్నరు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో లాంతర్లు, ఎండిన వరి కంకులు తేకుండా పంటలకు నీళ్లిచ్చినం..'అన్నారు.
* పలువురు మంత్రులు తీర్మానం సమయంలో సుదీర్ఘంగా ప్రసంగించడంతో.. 'మనం నాయకులం సమయం విషయంలో సోయి ఉండాలె. కార్యకర్తలందరూ చాలా దూరం పోవాలె. పెద్ద అంశమైతే ఏడు నిమిషాలు, చిన్న తీర్మానమైతే మూడు నిమిషాల్లో ప్రసంగాలను ముగించండి..'అని కేసీఆర్ సూచించారు. కానీ పలువురు మంత్రులు పది నిమిషాలకు పైగా ప్రసంగం కొనసాగించారు.
* విద్యుత్ కోతలు లేకుండా చేసిన ఆ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డిని 'ఇక నుంచి కరెంట్ రెడ్డి అని పిలవాల'న్నారు.
* సభా ప్రాంగణంలో కేసీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన చిన్నపాటి తోరణాలను చించుకునేందుకు కార్యకర్తలు పోటీపడడంతో కేసీఆర్ వారినుద్దేశిస్తూ.. 'సభ అయిపోయినంక ఎవరికి దమ్ముంటే వారు పీక్కోని పోండి.. అప్పటివరకు ఆగండి..' అని తనదైన శైలిలో చెప్పారు.
ప్లీనరీ సైడ్‌లైట్స్..
శుక్రవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన టీఆర్‌ఎస్ ప్లీనరీ ఆద్యంతం కళాకారుల పాటలు, కేసీఆర్ మార్కు పంచ్ డైలాగులు, కార్యకర్తల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో సందడిగా జరిగింది. అందులో పలు అంశాలు సభకు హాజరైనవారిని బాగా ఆకట్టుకున్నాయి.
* టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభా వేదిక వద్దకు రాగానే కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. ఆయన కార్యకర్తలకు అభివాదం చేసి వేదికపై ఆసీనులయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కేసీఆర్‌కు దట్టీ కట్టారు.
* టీఆర్‌ఎస్ అధినేతగా కేసీఆర్‌ను ప్రకటించిన సమయంలో వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యంత్రాల నుంచి గులాబీ పూలవర్షం కురిపించారు.
* వేదికతో పాటు మహిళలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు కూర్చున్న గ్యాలరీలపై పూలవర్షం కురవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమయంలో కార్యకర్తలు భారీగా బాణసంచా కాల్చారు.
* వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం గిరిజన సంస్కృతిని ప్రతి బింబించేలా ఏర్పాటు చేసిన డమరుకాన్ని కేసీఆర్ మో గించడం ఆకట్టుకుంది. ఇదే సమయంలో ‘గులాబీ జెండా లు ఎగరాలి.. ద్రోహుల గుండెలు అదరాలి..’ అంటూ పాటరావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది.
* టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నాయిని నరసింహారెడ్డి ప్రకటించిన అనంతరం కళాకారులు ఆలపించిన ‘సల్లంగుండాలయ్యా.. మాసారూ కేసీఆరూ.. మీరు పైలం గుండాలయ్యా మా ముఖ్యమంత్రిగారు..’ అన్న పాట బాగా ఆకట్టుకుంది.
* కేసీఆర్‌కు ఎక్సైజ్ మంత్రి పద్మారావు బోనం ఆకారంలో ఉన్న కళాకృతిని ఇచ్చి శిరస్సుపై పగిడి పెట్టి సన్మానించారు.
* కొందరు మహిళలు బతుకమ్మలు పేర్చుకొని వచ్చి కేసీఆర్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు.
* కేసీఆర్ తన ప్రసంగంలో పలుమార్లు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ.. అడిగి మరీ కార్యకర్తల చేత చప్పట్లు కొట్టించారు. ప్లీనరీ తీర్మానాల ఆమోదం సమయంలోనూ గట్టిగా చప్పట్లు కొట్టాలని పదేపదే కార్యకర్తలను కోరారు. వేదికపైనున్న ముఖ్య నేతలు సైతం గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరడం గమనార్హం.
* త్వరలో పార్టీ కార్యకర్తలకు పదవుల పందేరం మొదలుపెడతామని, ఈ విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలను నిర్లక్ష్యం చేయరాదని సీఎం సూచించినపుడు కార్యకర్తల చప్పట్లు, ఈలలతో ప్రాంగణం మారుమోగింది.
* కేసీఆర్ పలువురు నాయకులపై పంచ్ డైలాగులు విసిరి అందరినీ నవ్వించారు. కార్యసాధకుడు లక్ష్య సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనుదిరగడంటూ ఓ పద్యం వినిపించడం ఆకర్షించింది.
* అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌ను సన్మానించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోటీపడ్డారు. ఈ సమయంలో వేదిక కిక్కిరిసిపోవడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకొని అందరినీ కిందకు పంపించివేశారు.
* ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎయిర్ కూలర్లు తరచూ ఆగిపోవడంతో కార్యకర్తలు ప్లకార్డులతో విసురుకోవడం కనిపించింది. వేదికపై ఉన్న మంత్రులు సైతం ఉక్కపోత భరించలేక పార్టీ కరపత్రాలతో విసురుకున్నారు.
* వేదికపై నుంచి ఎమ్మెల్యే, సినీనటుడు బాబూమోహన్, ఎంపీ కవిత మహిళలకు అభివాదం చేస్తూ ఆకట్టుకున్నారు.
* మంత్రులు హరీశ్, కేటీఆర్‌ల ప్రసంగాల సమయంలో చప్పట్లు, ఈలలతో సభా ప్రాంగణం దద్దరిల్లింది.
* 'తెలంగాణ సీఎంగా కేసీఆర్ అవడంతో మా కల నిజమైం ద’ంటూ కళాకారులు ఓ పాట పాడిన సమయంలో కేసీఆర్.. ‘ఇది డబ్బాగొట్టే పాట' అంటూ నవ్వించారు.
ఉద్యమ సమయంలో తన జీపుపై నుంచి జెతైలంగాణ నినాదాలు చేసిన స్వీటీ అనే బాలిక .. సభకు వచ్చి తాను పైలట్ అయ్యేందుకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని వేదికపైకి ఎక్కి సీఎంకు వినతిపత్రం సమర్పించింది. దీంతో ఆయన ఆ బాలికకు ఎంత ఖర్చైనా ఇచ్చి పైలట్ చేస్తామని చెప్పి, అందరితో చప్పట్లు కొట్టించడం ఆకట్టుకుంది.