న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర | Hyderabad High Court suspends two Telangana judges | Sakshi
Sakshi News home page

న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర

Published Tue, Jun 28 2016 2:08 AM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర - Sakshi

న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర

► సంఘం అధ్యక్ష, కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు
► సంయుక్త కార్యదర్శి డిప్యుటేషన్ రద్దు

 
► రోడ్డెక్కిన మరుసటి రోజే హైకోర్టు చర్య
► భగ్గుమన్న న్యాయాధికారులు, న్యాయవాదులు
► నేటి నుంచి న్యాయాధికారుల మూకుమ్మడి సెలవులు
► రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల్లో స్తంభించనున్న విధులు
► ఏసీజే కోర్టు విధులను బహిష్కరించాలని న్యాయవాదుల తీర్మానం
► న్యాయశాఖ ఉద్యోగుల సహాయ నిరాకరణ

సాక్షి, హైదరాబాద్: న్యాయాధికారుల కేటాయింపుల వివాదం మరో కీలక మలుపు తిరిగింది. సర్వీసు నిబంధనలు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలంగాణ న్యాయాధికారులపై హైకోర్టు కన్నెర్ర చేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, వి.వరప్రసాద్‌లపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే హైకోర్టులో విధులు నిర్వర్తిస్తున్న సంఘం సంయుక్త కార్యదర్శి రాధాకృష్ణ చాహవాన్ డిప్యుటేషన్‌ను రద్దు చేసింది. తిరిగి ఆయన్ను గతంలో పనిచేసిన సైబరాబాద్ 24వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు పంపింది.

న్యాయాధికారుల కేటాయింపుల విషయంలో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ 120 మంది న్యాయాధికారులు ఆదివారం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించి గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజే వారిపై హైకోర్టు సస్పెన్షన్ వేటు వేయడం గమనార్హం. సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే హైకోర్టు తీరుపై అటు న్యాయాధికారులు, ఇటు న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు భగ్గుమన్నారు. మంగళవారం నుంచి సామూహిక సెలవులపై వెళ్లాలని న్యాయాధికారులు నిర్ణయించారు. అటు న్యాయవాదులు కూడా మంగళవారం నుంచి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కోర్టు విధులను బహిష్కరించాలని తీర్మానించారు. న్యాయశాఖకు చెందిన ఉద్యోగులు సహాయ నిరాకరణకు నిర్ణయించారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం నుంచి తెలంగాణలోని అన్ని కోర్టుల్లో విధులు స్తంభించనున్నాయి.
 
బాధ్యతలు వేరే వారికి అప్పగించండి
న్యాయాధికారుల కేటాయింపులకు సంబంధించి హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలంటూ న్యాయవాదులు ప్రారంభించిన ఆందోళనల్లో పాల్గొన్నారంటూ న్యాయాధికారుల సంఘం నేతలను రిజిస్ట్రార్ జనరల్ ద్వారా హైకోర్టు వివరణ కోరింది. దీనిపై సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వివరణలు ఇచ్చారు. అయితే ఈ వివరణలపై సంతృప్తి చెందని హైకోర్టు వీరిపై సస్పెన్షన్ వేటు వేయాలని తీర్మానించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం న్యాయాధికారులు రోడ్డెక్కి ర్యాలీ నిర్వహించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.

తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం తన సహచర సీనియర్ న్యాయమూర్తులతో తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 నిబంధనలను అనుసరించి వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ (విజిలెన్స్) పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. వెంటనే వారు నిర్వర్తిస్తున్న బాధ్యతలను మరొకరికి అప్పగించాలని ఆ ఉత్తర్వుల్లో హైకోర్టు ఆదేశించింది. తమ అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని కూడా వారికి తేల్చి చెప్పింది.
 
లాయర్ల అత్యవసర సమావేశం
రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు మండిపడ్డారు. హైకోర్టులో న్యాయవాదులు సాయంత్రం నాలుగు గంటలకు అత్యవసరంగా సమావేశమయ్యారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహనరావు నేతృత్వంలో సమావేశమైన న్యాయవాదులు ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్‌ను ఖండిస్తూ తీర్మానం చేశారు. వారి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని వెంటనే వెనక్కి పిలిపించాలని రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. సస్పెన్షన్‌ను ఎత్తివేసేంత వరకు ఏసీజే కోర్టు విధులను బహిష్కరించాలని న్యాయవాదులకు పిలుపునిచ్చారు. బదిలీపై వెళ్లనున్న ఏసీజేకు వీడ్కోలు సభ ఏర్పాటు చేయరాదని, ఆ సభను బహిష్కరించాలని తీర్మానించారు. అనంతరం ర్యాలీగా మదీనా వరకు వెళ్లి ఏసీజేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం హైకోర్టు గేట్ల ముందు బైఠాయించి నిరసన తెలియచేశారు.

నేడు న్యాయాధికారుల కార్యాచరణ
సహచర న్యాయాధికారులు, సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సస్పెండ్ చేయడంపై న్యాయాధికారులు మండిపడుతున్నారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించారు. 200 మంది న్యాయాధికారులు సామూహికంగా సెలవులపై వెళ్లాలని నిర్ణయించి, ఆ మేరకు సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. సస్పెన్షన్ ఎత్తివేయకుంటే నిరాహారదీక్షకు దిగాలని కూడా యోచిస్తున్నారు. మంగళవారం జరిగే సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రవీందర్‌రెడ్డి, వరప్రసాద్ సస్పెన్షన్‌ను ఉమ్మడి బార్ కౌన్సిల్‌లోని తెలంగాణ సభ్యులు ఖండించారు. వెంటనే సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. సహాయ నిరాకరణ పాటించాని న్యాయశాఖ ఉద్యోగులు నిర్ణయించారు.
 
జేఏసీ కో-కన్వీనర్ ఆత్మహత్యాయత్నం

న్యాయాధికారుల సస్పెన్షన్‌తో మనస్తాపానికి గురైన తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కో-కన్వీనర్ ఎం.ఎస్. తిరుమల్ రావు సోమవారం సాయంత్రం ఒంటిపై పెట్రోల్ పొసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సస్పెన్షన్‌ను నిరసిస్తూ జేఏసీ లాయర్లు సిటీ సివిల్ కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయల్దేరారు. పోలీసులు అడ్డుకోవడంతో జై తెలంగాణ నినాదాలు చేస్తూ తిరుమల్ రావు వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.వెంటనే న్యాయవాదులు, పోలీసులు ఆయన్ను నిలువరించి పురానీహవేలిలోని దుర్రు షెహవర్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయులో చికిత్స అందజేస్తున్నారు. తెలంగాణ జేఏసీ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు, సిటీ సివిల్ కోర్టు జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులు తిరుమల్‌రావును పరామర్శించారు. మరోవైపు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తిరుమల్‌రావుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement