సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం మరో సాహితీ ఉత్సవానికి వేదిక కానుంది. ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ సాహిత్యోత్సవం’ఈ నెల 26 నుంచి మూడు రోజుల పాటు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ సన్నాహాలు చేపట్టింది. వివిధ భాషల సాహిత్య, సాంస్కృతిక రంగాలతో పాటు సామాజిక, ఆర్థిక అంశాలపై సదస్సులు నిర్వహించనున్నారు. హైదరాబాద్ సాహిత్యోత్సవంలో ఈ ఏడాది అతిథి దేశంగా స్పెయిన్ హాజరుకానుంది.
ఆ దేశానికి చెందిన మేధావులు, రచయితలు, కళాకారులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. అమెరికా, బ్రిటన్, కొలంబియా, కెనడా, ఇజ్రాయెల్ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు సైతం తరలిరానున్నారు. హైదరాబాద్ సాహిత్యోత్సవాల్లో ఈసారి భారతీయ భాషగా కన్నడంపై విస్తృత చర్చలు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కర్ణాటకకు చెందిన సాహితీ ప్రముఖులు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కేంద్ర సాహిత్య అకాడమీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ కంబారా ఈ ఉత్సవాలకు హాజరుకానున్నారు.
బెంగళూరులో ప్రఖ్యాత రంగశంకర్ థియేటర్ నిర్మాత అరుంధతినాగ్, ప్రముఖ దళిత సామాజిక కార్యకర్త సరస్వతి, దివంగత పాత్రికేయురాలు గౌరీలంకేష్ స్నేహితురాలు, ప్రముఖ ఆర్టిస్ట్ పుష్ప మేలా తదితరులు పలు అంశాలపై ప్రసంగిస్తారు. ప్రముఖ పాత్రికేయులు రాజ్‌దీప్ సర్దేశాయ్, సాగరికా ఘోష్, సీమా ముస్తఫా, శివఅరూర్ తదితరులు కూడా పాల్గొననున్నారు.
ప్రముఖులకు నివాళులు..
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభం సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో అపార సేవలందించి కన్నుమూసిన ప్రముఖులకు నివాళులర్పిస్తారు. ఈ ఏడాది నలుగురు మహనీయులకు ఈ ఉత్సవాల సందర్భంగా నివాళులర్పించనున్నారు. హిందుస్థానీ సంగీ తంలో ట్రుమీ సింగర్‌గా పేరొందిన ప్రముఖ గాయని గిరిజాదేవి, బాలీవుడ్ సినీదిగ్గజం శశికపూర్, బాలీవుడ్, రంగస్థల నటుడు టామాల్టర్, ప్రముఖ పాత్రికేయురాలు గౌరీలంకేష్‌ను స్మరిస్తూ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభంకానుంది.
ఆకట్టుకోనున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
వైవిధ్యభరితమైన సాంస్కృతిక, కళారూపాలను సమున్నతంగా ఆవిష్కరించే లక్ష్యంతో 2010 నుంచి ఏటా హైదరాబాద్ సాహిత్యోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇది ఎనిమిదో వేడుక. ఈసారి కూడా అద్భుతమైన కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు ఆహూతులను ఆకట్టుకోనున్నాయి. స్పెయిన్ కళాకారుల జానపద నృత్యం ‘ఫ్లెమెంకో’ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కన్నడంలో ప్రముఖ అంతర్జాతీయ సినీ దర్శకుడు గిరీష్ కాసరవల్లి దర్శకత్వంలో వెలువడిన ‘ఘటశ్రాధ’, ‘గులాబీ టాకీస్’, ‘ద్వీప’చిత్రాలను ప్రదర్శిస్తారు.
శశికపూర్ కూమార్తె సంజనకపూర్ ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. శశికపూర్ తీసిన సినిమా ‘షేక్‌స్పియరియానా’ను ప్రదర్శించనున్నారు. అలాగే టామాల్టన్ సినిమాలు కూడా ప్రదర్శిస్తారు. వీటితో పాటు వంట చేస్తూ చెప్పే సరస్వతి రామాయణం కథ, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ‘నన్న నుక్కడ్’(చిన్నారుల వీధి మలుపు), హైదరాబాద్ దక్కనీ హాస్య కవితా సమ్మేళనం, ముంబైకి చెందిన సంగీత, నృత్యకళాకారుల ‘బాంబే బైరాగ్’, కాలితో అద్భుతమైన చిత్రాలు గీసే కళాకారుడు బందేనవాజ్ నదీఫ్ ఫుట్ అండ్ మౌత్ పెయింటింగ్, తెలంగాణ విమెన్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళా చిత్రకారుల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment