చదివింది ఎంబీబీఎస్‌...చేసేది గంజాయి వ్యాపారం | hyderabad neurology doctor making chocolates with Cannabis | Sakshi
Sakshi News home page

చదివింది ఎంబీబీఎస్‌...చేసేది గంజాయి వ్యాపారం

Published Sun, Jan 29 2017 10:02 AM | Last Updated on Fri, May 25 2018 2:11 PM

చదివింది ఎంబీబీఎస్‌...చేసేది గంజాయి వ్యాపారం - Sakshi

చదివింది ఎంబీబీఎస్‌...చేసేది గంజాయి వ్యాపారం

తన న్యూరాలజీ వైద్య అనుభవంతో
ప్రజల మెదడుకు మత్తు ఎక్కిస్తున్న వైద్యుడు
చాక్లెట్లలో గంజాయి కలిపి విక్రయిస్తూ....

 
పహాడీషరీఫ్‌: ఎంబీబీఎస్‌ వైద్య విద్యనభ్యసించిన ఓ డాక్టర్‌ అక్రమార్జన కోసం గంజాయి కలిపి కల్తీ చాక్లెట్లు తయారు చేస్తూ పోలీసులకు చిక్కాడు. ఎస్‌వోటీ పోలీసులు సదరు డాక్టర్‌ను అరెస్ట్‌ చేసి పహాడీషరీఫ్‌ పోలీసులకు అప్పగించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన మహ్మద్‌ సుజాత్‌ అలీ ఖాన్‌(35) 2006లో డక్కన్‌ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. అప్పటి నుంచి 2014వరకు నిమ్స్‌లో రీసెర్చ్‌ కో–ఆర్డినేటర్‌గా పనిచేశాడు. అనంతరం అక్కడ ఉద్యోగం మానేసిన అతడు జిమ్‌లో ఫిట్‌నెస్‌ కన్సల్టెంట్‌గా చేరి ప్రజలకు ఆహారపు అలవాట్లపై సలహాలివ్వడం ప్రారంభించాడు. కాగా సరైన సంపాదన లేకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. దీంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాక్లెట్లలో గంజాయి కలిపి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. గంజాయి...చాక్లెట్‌ కల్తీ చేయడాన్ని యూ ట్యూబ్‌లో చూసి నేర్చుకున్నాడు.

న్యూరాలజీ డాక్టరైన అతనికి ఏ మోతాదులో కలిపితే ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం సులభమయ్యింది. వివిధ మార్గాల ద్వారా వెంటనే గంజాయి తెప్పించుకొని దానిని పౌడర్‌గా మార్చి...చాక్లెట్‌ పౌడర్‌తో కలిపి చాక్లెట్‌ మిశ్రమాన్ని తయారు చేయడం ప్రారంభించాడు. కాగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఒక పేరుతో గ్రూప్‌ తయారు చేశాడు. ఈ చాక్లెట్‌లో కలిపిన గంజాయి పనితీరును వారికి వివరించేవాడు. ఇలాంటి కల్పిత చాక్లెట్లకు ఎక్స్, 2ఎక్స్, 3ఎక్స్‌ల బ్రాండ్‌ పేర్కొంటూ ఒక్కోటి రూ. 500ల నుంచి రూ.1800ల వరకు విక్రయించేవాడు. ఇతర రాష్ట్రాల వారికి కూడా సరఫరా చేస్తూ సులభంగా డబ్బు సంపాదించగలిగాడు.

ఈ క్రమంలో షాహిన్‌నగర్‌లో వినియోగదారుడికి విక్రయించే క్రమంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్లు కె.నర్సింగ్‌ రావు, జి.నవీన్‌కుమార్, పహాడీషరీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.లక్ష్మీకాంతరెడ్డిలు దాడులు నిర్వహించి అతన్ని అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి బైక్‌తో పాటు రూ.12,520ల నగదు, గంజాయి కలిపిన 45 చాక్లెట్లు, ఇతర చాక్లెట్లు తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాగా ఇతడు చాక్లెట్‌ కేక్, కోకో పౌడర్, నెయ్యి, నూనె, ప్లాస్టిక్‌ కప్, లేబుల్స్‌ లు ఇలా చాక్లెట్‌ తాయరీకి సంబంధించిన ముడి సామాగ్రిని కొనుగోలు చేసి ఈ కల్తీ చాక్లెట్ల తయారీకి పాల్పడుతున్నాడు. ఈ చాక్లెట్లను తిన్నవారు దాదాపు ఎనిమిది గంటల పాటు అపస్మారక స్థితిలో మత్తులో ఉండడం...వారిలో ఎక్కువ యువతే ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మెదడుపై దీని ప్రభావం అధికంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement