
తాగి నడిపితే.. తాట తీస్తారు!
► జరిమానా, శిక్షలతో పాటు కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్
► చదివే విద్యా సంస్థ, ఉద్యోగం చేసే సంస్థలకు సమాచారం
► మద్యం తాగి వాహనం నడిపేవారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధం
► రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై స్పెషల్ ఫోకస్
► పాస్‌పోర్టులు, వీసాల జారీ సంస్థలకు కూడా అందజేయాలని నిర్ణయం
► ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నియామకాల సంస్థలకు మందు బాబుల జాబితా
► సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిన నగర పోలీసు విభాగం
► చిన్నారి రమ్య మృతి ఘటనతో అధికారుల నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడిపే మందు బాబులకు దెబ్బకు ‘కిక్కు’దిగే చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కేవారితో పాటు వారి కుటుంబసభ్యులకు కలిపి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. వారు చదివే విద్యా సంస్థకు, ఉద్యోగం చేసే సంస్థకూ ఈ సమాచారం ఇవ్వనున్నారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ నియామకాల సంస్థలకు ‘మందు బాబుల’ జాబితా అందించనున్నారు. మొత్తంగా ‘డ్రంకెన్ డ్రైవర్ల’లో పరివర్తన తీసుకురావడానికి.. రోడ్డు ప్రమాదాల నిరోధానికి చర్యలు చేపడుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదం ఉదంతం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు విభాగం పలు కఠిన చర్యలకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
కుటుంబ సభ్యులకూ కౌన్సెలింగ్..
ప్రస్తుతం తనిఖీల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కే వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ల్లో కౌన్సెలింగ్ ఇచ్చి కోర్టుకు తరలిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కౌన్సెలింగ్‌కు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడినవారు మాత్రమే హాజరవుతున్నారు. ఇక ముందు మాత్రం సదరు వ్యక్తులు వివాహితులైతే భార్య/భర్త, అవివాహితులైతే తల్లిదండ్రులు/సంరక్షకుడితో కలిపి కౌన్సెలింగ్ చేస్తారు. వారితోపాటు మద్యం తాగిన స్థితిలో వాహనం నడిపేందుకు పరోక్షంగా సహకరించిన వ్యక్తులు/సంస్థలకూ కౌన్సెలింగ్ చేస్తారు. అంటే మద్యం అమ్మిన వైన్‌షాపు, సరఫరా చేసిన బార్ యాజమాన్యాలనూ కౌన్సెలింగ్‌కు పిలుస్తారు. ఇక ‘డ్రంకెన్ డ్రైవ్’లో చిక్కిన వారిలో విద్యార్థులు, ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగులూ పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారు మద్యం తాగి వాహనం నడుపుతూ చిక్కారని, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ.. సదరు విద్యా సంస్థ/పనిచేసే కార్యాలయాలకు అధికారికంగా లేఖలు రాయనున్నారు.
ప్రమాదం జరిగితే పక్కా చర్యలు
ఇకపై జరిగే ప్రతి రోడ్డు ప్రమాదం కేసులోనూ బాధ్యులైన వారికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేస్తారు. దీంతో పాటు రక్తనమూనాలు సేకరించి పరీక్షలు చేయించడం ద్వారా వైద్యులిచ్చే నివేదికలను కేసు ఫైల్‌లో చేరుస్తారు. సదరు వ్యక్తి మద్యం తాగి ఉన్నట్లు తేలితే.. 304 పార్ట్ 2 తదితర సెక్షన్లను జోడిస్తారు. ఆ వ్యక్తి మద్యం సేవించిన బార్ నుంచి సీసీ కెమెరా ఫుటేజీలను సేకరిస్తారు. ప్రమాదం 21 ఏళ్ళ కంటే తక్కువ వయసున్న వారి వల్ల జరిగితే.. వారు మద్యం తాగిన బార్, విక్రయించిన వైన్‌షాపు లెసైన్సు రద్దుకు సిఫార్సు చేస్తారు. డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కినవారికి డ్రైవింగ్ లెసైన్స్ లేకపోతే వాహనం యజమానిపై చర్యలు తీసుకుంటారు.
దర్యాప్తులో ‘ట్రాఫిక్’కు భాగస్వామ్యం
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నిరోధం బాధ్యత ట్రాఫిక్ పోలీసులది. ప్రమాదాలు జరిగినప్పుడు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టేది శాంతి భద్రతల విభాగం పోలీసులది. కేవలం శాంతి భద్రతల విభాగం అందించే డేటాపైనే ట్రాఫిక్ పోలీసులు ఆధారపడుతున్నారు. దీంతో ఇకపై ప్రమాదాల కేసుల నమోదు నుంచి దర్యాప్తు పూర్తయ్యే వరకు ట్రాఫిక్ పోలీసులకు కూడా భాగస్వామ్యం కల్పిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనం ఉన్న కండిషన్, డ్రైవర్ వ్యవహారశైలి, వీటిలో దేని వల్ల ప్రమాదం జరిగిందనేది పక్కాగా గుర్తిస్తారు. ఈ వివరాలను ఆర్టీఏ, ప్రణాళిక, రోడ్ ఇంజనీరింగ్, రోడ్ సేఫ్టీ విభాగాలకు అందిస్తారు.
అందరికీ అందుబాటులో డేటాబేస్
మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కడం, ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ వల్ల ప్రమాదాలకు కారణమైన, తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిన వారి వివరాలతో సమగ్ర డేటాబేస్ సిద్ధం చేస్తున్నారు. వివిధ రకాల సేవలందించే విభాగాలకు ఈ వివరాలను అందుబాటులో ఉంచుతారు. ఆయా విభాగాలు ఈ వివరాలు సరిచూసుకుని తదుపరి చర్యలు తీసుకుంటాయి.
ఎవరెవరికి అందజేస్తారు..?
♦ పాస్‌పోర్టులు జారీ చేసే ఆర్‌పీవో
♦ వీసా జారీ చేసే ఎంబసీలు/కాన్సులేట్‌లు
♦ ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగాలు ఇచ్చే ఏజెన్సీలు
♦ ఉద్యోగం పొందడం, పదోన్నతుల్లో కీలకమైన క్యారెక్టర్ సర్టిఫికెట్ల జారీ
♦ డ్రైవింగ్ లెసైన్సులు జారీ/రెన్యువల్ చేసే ఆర్టీఏ
♦ వాహనాల రిజిస్ట్రేషన్/రెన్యువల్ సమయాల్లో
♦ పాఠశాలలు/కాలేజీల్లో అడ్మిషన్ ఇచ్చే సంస్థలు
♦ సదరు వ్యక్తి చదువుతున్న విద్యా సంస్థ
♦ ఆ వ్యక్తి పనిచేస్తున్న ప్రభుత్వ/ప్రైవేట్ సంస్థ
♦ వ్యాపార లెసైన్సులు జారీ చేసే ప్రభుత్వ సంస్థలు
వారం రోజుల్లో అమల్లోకి..
‘‘హైదరాబాద్‌ను ప్రమాద రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చర్యలు చేపట్టాం. వారం రోజుల్లో నూతన విధానాలు అమల్లోకి వస్తాయి. ఇకపై ప్రతి ఉల్లంఘన, ప్రమాదంలోనూ బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్ష చేస్తాం. రక్తపరీక్షతో పాటు వైద్యులతో పరీక్షలు చేయించి ధ్రువీకరణ తీసుకుంటాం. ప్రతి ప్రమాదానికి సంబంధించి కారకులతో పాటు భార్య/భర్తకు, తల్లిదండ్రులకూ కౌన్సెలింగ్ ఉంటుంది..’’
- ఏవీ రంగనాథ్, ట్రాఫిక్ డీసీపీ