
కేంద్రం సహకరిస్తేనే అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు చెప్పారు.
♦ నేను ఎవ్వరికీ భయపడటంలేదు
♦ జూన్ తర్వాత అసెంబ్లీ విజయవాడలోనే: సీఎం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్లే కేంద్రంపై తాను మాట్లాడలేకపోతున్నానని, అంతే తప్ప తాను ఎవరికీ భయపడటం లేదని స్పష్టం చేశారు. వచ్చే జూన్ తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు విజయవాడలోనే జరుగుతాయని ప్రకటించారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలతో పోటీపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర విభజనలో హేతుబద్ధత లోపించిన కారణంగా సమస్యలు వస్తున్నాయన్నారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే చర్చకు ముఖ్యమంత్రి బుధవారం శాసనసభకు సమాధానం ఇచ్చారు. రాజధాని అమరావతి కోసం భూములు కొనుగోలు చేయాలంటే రూ. 40 వేల కోట్లు కావాలని, ఇంత మొత్తం భరించే శక్తి లేని కారణంగానే భూసమీకరణ చేపట్టామని తెలిపారు. రైతులందరి ఆమోదంతో ఈ ప్రక్రియను పూర్తిచేసినా... విపక్షం దీన్ని రాద్ధంతం చేస్తోందని విమర్శించారు. ప్రతికూల పరిస్థితులున్నా రాష్ట్రాభివృద్ధి వేగంగా ముందుకెళ్తోందని వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయమే ప్రధాన ఆదాయమని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక, సేవా, ఐటీ రంగాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానిని నిర్మించేందుకు నిధులు ఎలా సమకూర్చాలనే విషయమై ఆలోచిస్తున్నామని, దీనికోసం అప్పులు తేవడమా, ఎన్‌ఆర్‌ఐ బాండ్స్ వెళ్ళడమా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, మరికొన్ని రోడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక గ్రాంట్లు ఇస్తుందన్న విశ్వాసం తమకు ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్రం ముందుకొస్తే పోలవరం అప్పగిస్తాం
పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి చేస్తామంటే, అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కాంట్రాక్టుల విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను తాము చేపడుతున్నామని, ఇవి పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని చెప్పారు. పట్టిసీమను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, నిర్ణీత కాలవ్యవధిలోనే పూర్తిచేశామని, రాయలసీమకు తాగునీరు అందించే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు.