అవును.. అవి అక్రమ రిజిస్ట్రేషన్లే!
సాక్షి, హైదరాబాద్: ప్రజల సౌలభ్యం కోసం స్టాంపులు-రిజిస్ట్రేషన్లశాఖ అమలు చేస్తున్న ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ ప్రక్రియ అక్రమార్కులకు వరంగా మారిందని ఎట్టకేలకు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. గతేడాది హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ సమీపంలో సుమారు రూ. 20 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల పాలైన తీరును విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తాజాగా నిగ్గుతేల్చింది. ఈ విషయమై ‘ఎనీవేర్ దందా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనాన్ని విజిలెన్స్ అధికారులు సుమోటోగా విచారణకు స్వీకరించారు.
ఎల్బీనగర్ సమీపంలో సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (సిరీస్)కు ప్రభుత్వం కేటాయించిన 36.45 ఎకరాల్లో కొంత భాగాన్ని కంపెనీ యాజమాన్యం ప్రైవేటు వ్యక్తులకు విక్రయించగా దాన్ని ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రిజిస్ట్రేషన్ ధర గజం రూ. 35 వేలు ఉండగా దాన్ని రూ. 13 వేలకు తగ్గించి రిజిస్ట్రేషన్ చేశారని, దీనివల్ల సర్కారు ఖజానాకు రూ. 1.42 కోట్ల నష్టం వాటిల్లందని సర్కారు దృష్టికి తెచ్చారు.
అలాగే ఒకే డోర్ నంబర్‌తో ఉన్న భూమి మొత్తానికి ఒకే రకమైన రిజిస్ట్రేషన్ విలువను వర్తింపజేయాల్సి ఉన్నా కొంత స్థలాన్ని గజం రూ. 35 వేలు (కమర్షియల్) కేటగిరీగా, మిగిలిన భూమి విలువను గజం రూ. 13 వేలు (రెసిడెన్షియల్)గా విభజించారని వివరించారు. కంపెనీ యాజమాన్య ప్రతినిధులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేశ్, సదాశివన్ అనే సబ్ రిజిస్ట్రార్లను విచారించిన అధికారులు ఈ వ్యవహారంలో సదరు సబ్ రిజిస్ట్రార్లు అక్రమాలకు పాల్పడ్డారని ధ్రువీకరించారు. వారిని తక్షణం సస్పెండ్ చేయాలని సూచిస్తూ రిజిస్ట్రేషన్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు విజిలెన్స్ విభాగం డెరైక్టర్ జనరల్ రాజీవ్‌త్రివేది లేఖ రాశారు.
అక్రమాలు జరిగింది ఇలా...
‘సిరీస్’ అనే పరిశోధన సంస్థకు ప్రభుత్వం 1965లో సుమారు 36.45 ఎకరాల భూమిని కేటాయించింది. సర్వే నంబరు 9/1, 49/13లలో ప్రభుత్వం కేటాయించిన ఈ భూమిని ప్రభుత్వ అన.ుమతి లేకుండా క్రయ, విక్రయ రిజిస్ట్రేషన్లు జరపకూడదని ప్రొహిబిటరీ ఆర్డర్ ఉంది. అయితే నిబంధనలను తుంగలో తొక్కిన ఎల్బీ నగర్ జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు సర్కారు భూమిని ప్రైవేటు వ్యక్తులకు అడ్డంగా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూమి సరూర్‌నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేటు వ్యక్తులు... ఎల్బీ నగర్‌లోని జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్లు కానిచ్చేశారు. నిషేధిత ఆస్తుల జాబితా (పీవోబీ)లోని భూముల విషయమై రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌తో జరిగిన సమావేశానికి స్వయం గా హాజరైన ఎల్బీనగర్ సబ్ రిజిస్ట్రార్ ఒకరు తాజాగా విజిలెన్స్ విచారణలో పీవోబీ వివరాలను రెవెన్యూ అధికారులు వెబ్ సైట్లో పొందుపరచలేదని బుకాయించడం గమనార్హం.