♦ అలసత్వంతో మూల్యం చెల్లించిన ప్రభుత్వం
♦ రూ.1,274 కోట్లు పోయాక ఉరుకులు పరుగులు
♦ టీఎస్‌బీసీఎల్‌పై నెల రోజులుగా న్యాయశాఖలోఆగిన ఫైలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ సర్కారు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా వ్యవహరించింది. ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇచ్చిన నోటీసులను బేఖాతరు చేయటంతోపాటు గడువులోగా కోర్టును ఆశ్రయించకపోవటంతో భారీ మూల్యం చెల్లించుకుంది. తెలంగాణ బేవరేజేస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్) బకాయిల కింద ఐటీ శాఖ ఏకంగా రూ.1,274 కోట్లు నేరుగా ఆర్‌బీఐ నుంచి సీజ్ చేసుకుంది. గడువులోగా చెల్లించలేదని, తాము నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదనే కారణంతో ఈ చర్య తీసుకుంది.
ఊహించని ఈ పరిణామంతో తెలంగాణ ఆర్థిక శాఖ బిత్తరపోయింది. హుటాహుటిన మంత్రి కె.తారకరామారావు అధ్వర్యంలోని బృందం ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసింది. అయితే ఐటీ సీజ్ చేసిన నిధులు తిరిగి వచ్చే అవకాశం లేదు. గ్రాంట్లు లేదా నిధుల రూపంలో ప్రత్యామ్నాయంగా కేంద్రం నుంచి సాయం ఆశించటం తప్ప ఐటీ సీజ్ చేసిన డబ్బు వెనక్కి రావటం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
ఎందుకిలా జరిగింది..?
మార్చి నెలలోనే తమ పన్ను బకాయిలు చెల్లించాలంటూ టీఎస్‌బీసీఎల్ పరిధిలోని మద్యం డిపోలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. 2012-14 వరకు రెండేళ్లకు సంబంధించిన బకాయిలు చెల్లించాలని అటాచ్‌మెంట్ నోటీసులిచ్చారు. ఏపీబీసీఎల్‌కు ఇచ్చిన నోటీసులు తమకు వర్తించవంటూ తెలంగాణ సర్కారు హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉందని, టీఎస్‌బీసీఎల్ అనే సంస్థ లేనే లేదని వాదించింది. ఆ నోటీసులపై వెంటనే స్టే ఇచ్చిన హైకోర్టు... ఏపీబీసీఎల్, టీఎస్‌బీసీఎల్ మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల తర్వాత బకాయిలు వసూలు చేసుకోవచ్చంటూ ఐటీ విభాగానికి సూచించింది.
దీంతో ఐటీ అధికారులు మళ్లీ రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా నోటీసులిచ్చారు. తెలంగాణ సర్కారు ఈ నోటీసులపై ఇప్పటికీ స్పందించలేదు. మరోసారి కోర్టులో సవాలు చేయాల్సిన అవసరాన్ని సూచిస్తూ ఆర్థిక శాఖ ఈ ఫైలును న్యాయ శాఖకు, అక్కణ్నుంచి అడ్వకేట్ జనరల్‌కు పంపించింది. నెల రోజులు గడిచినా పిటిషన్ దాఖలు చేయకపోవటంతో ఐటీ శాఖ నిధుల జప్తుకు సిద్ధపడింది. టీఎస్‌బీసీఎల్ తరహాలోనే తెలంగాణ ఫుడ్స్ కూడా ఐటీ చిక్కుల్లో పడింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ఫుడ్స్‌గా ఉన్నప్పుడు సెక్షన్ 10 కింద ఈ కార్పొరేషన్‌కు ఐటీ మినహాయింపు ఉంది. కానీ దీన్ని ఆర్థిక లావాదేవీల వ్యాపారంగా చూపించటంతో తెలంగాణ ఫుడ్స్‌కు ఐటీ విభాగం ఈ సెక్షన్ రిజిస్ట్రేషన్ రద్దు చేసినట్లు నోటీసులు జారీ చేసింది. దీంతో ఐటీ పన్నులు తప్పని పరిస్థితి తలెత్తింది.
సర్కారుకు ఐటీ చిక్కులు!
Published Sun, Jun 28 2015 3:57 AM | Last Updated on Thu, Sep 27 2018 4:02 PM
Advertisement