సాక్షి, హైదరాబాద్: పోస్టల్ ఖాతాలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. 2005 నుంచి పోస్టల్ ఖాతాలకు సంబంధించిన డిపాజిట్ల వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు. తాజాగా ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో ఐటీ ప్రత్యేక బృందాలు దాడులు చేశాయి. మదుపరుల సమాచారం, వారు చెల్లిస్తున్న ఆదాయపు పన్ను గురించి అధికారులు వాకబు చేసినట్లు తెలిసింది. కాగా, ఐటీ దాడులు తదితర పరిణామాలపై తంతి తపాలా అధికారులు కినుక వహిస్తున్నారు. తమ ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఆదాయపు పన్ను వసూళ్ళ లక్ష్యాన్ని సాధించడంలో వెనుకబడ్డ ఐటీ శాఖ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది.
ఇటీవల సాఫ్ట్‌వేర్ శిక్షణ సంస్థల లావాదేవీలను పరిశీలించింది. ఇదే క్రమంలో ఇప్పుడు పోస్టల్ శాఖలో పెద్ద ఎత్తున డిపాజిట్లు చేసిన వారిపై కన్నేసింది. నగదు డిపాజిట్ల విషయంలో జాతీయ బ్యాంకులు అనేక నిబంధనలు విధిస్తున్నాయి. పాన్ నంబర్‌ను కూడా తప్పనిసరి చేస్తున్నాయి. దీంతో మదుపు చేసే ప్రతీ పైసాకు ఐటీ లెక్కలు తప్పనిసరిగా చూపించాల్సి వస్తోంది. స్థిరాస్తులు విక్రయించిన మొత్తాలను డిపాజిట్లు చేశామని చెప్పినా చిక్కులు తప్పడం లేదు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి వివరాలు తెప్పించుకుని మరీ ఐటీ శాఖ లెక్కలు కడుతోంది. ఈ తలనొప్పులు రాకుండా కొంతమంది జిల్లాల్లోని పోస్టాఫీసుల్లో నగదును డిపాజిట్ చేస్తున్నారు. బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువ ఉండటం, ఏజెంట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల డిపాజిట్‌దారులు పోస్టాఫీసుల వైపు మొగ్గు చూపుతున్నారు. గడచిన నాలుగేళ్ళుగా ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ తరహా డిపాజిట్లు ఎక్కువగా జరిగినట్టు సమాచారం.
అక్కడ స్థిరాస్తుల విలువ కూడా భారీగా పెరిగింది. ఫలితంగా పెద్ద మొత్తంలో మదుపు చేసినట్టు తెలుస్తోంది. తాజాగా ఐటీ శాఖ 2005 నుంచి లెక్కలు బయటకు తీయడంపై పోస్టల్ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అంతంత మాత్రంగా నడుస్తున్న పోస్టల్ శాఖకు ఈ పరిణామాలు ఇబ్బంది కలిగిస్తాయని చెబుతున్నారు. ఐటీ అధికారులు మాత్రం వీరి వాదనను కొట్టిపారేస్తున్నారు. పెరిగిన స్థిరాస్తి ఆదాయానికి సరిపడా ఇన్‌కం టాక్స్ చెల్లించడం లేదని గుర్తించామని, అందుకే లోతుగా విశ్లేషించాల్సి వస్తోందని చెబుతున్నారు. వివరాలు సరిగా ఉంటే, తాము ఎలాంటి ఇబ్బందులు కల్గించబోమని చెప్పారు. ఐటీ పరిధిలోకి వచ్చే భారీ డిపాజిట్లపైనే దృష్టి పెట్టినట్టు స్పష్టం చేస్తున్నారు.
పోస్టల్ ఖాతాలపై ఐటీ కన్ను
Published Fri, Oct 18 2013 4:11 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM
Advertisement
Advertisement