పదివేల కోట్లు కాదు.. లక్షన్నర కూడా లేదు!
తన వద్ద పదివేల కోట్ల రూపాయలు ఉన్నాయంటూ స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం సమయంలో ప్రకటించిన వ్యాపారవేత్త లక్ష్మణ్‌రావు ఇంట్లోను, కార్యాలయాల్లోను సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులకు కళ్లు తిరిగాయి. సాధారణంగా తాము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంటే అధికారులు ఆశ్చర్యపోతారు. కానీ ఈసారి మాత్రం చెప్పినది కొండంత అయితే.. అసలు ఉన్నది గోరంత మాత్రమే కావడంతో వాళ్లు ఉసూరుమన్నారు. బీఎల్ఆర్ బిల్డర్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆయన, ఆయన భార్య బి.రమాదేవి డైరెక్టర్లుగా ఉన్నారు.
2014 మార్చి 31న వాళ్లు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద తమ ఆస్తుల వివరాలను ఫైల్ చేశారు. దాని ప్రకారం కంపెనీ ఆస్తుల మొత్తం విలువ రూ. 1.42 లక్షలు మాత్రమే. మొత్తం నాలుగు కంపెనీల్లో లక్ష్మణ్‌రావు డైరెక్టర్‌గా ఉన్నా, వాటిలో ఒక్కదానికి మాత్రమే బ్యాలెన్స్ షీటు సమర్పించారు. దాని ప్రకారమే ఈ విలువ లెక్కతేలింది. ఫిల్మ్‌నగర్‌లో టెన్నిస్ స్టార్లు, సినిమా నటులు, మంత్రులు నివసించే ఖరీదైన ప్రాంతంలోనే లక్ష్మణ్‌రావు కూడా ఉంటున్నారు. ఆ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలకు స్థానిక పోలీసులు కూడా సహకరించారు. ఈయన తన వద్ద మొత్తం పదివేల కోట్ల సొత్తు ఉన్నట్లు ఐడీఎస్ (స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం) సందర్భంగా చెప్పినా.. ఆ మొత్తం లేదని, కేవలం 1.42 లక్షలు మాత్రమే ఉందని తేలడంతో ఇంకా ఏమైనా వివరాలు తెలుస్తాయేమోనని సోదాలు కొనసాగిస్తున్నారు. ఆయన ఇద్దరు కొడుకులు, కోడళ్లను కూడా ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఇప్పటికీ ఆ సోదాలు కొనసాగుతున్నాయి.