
ఆదివారాల్లోనే అధికం
వారాంతాల్లో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు
ఈ ఏడాది మృతుల్లో ద్విచక్ర వాహనదారులే అధికం
స్పీడ్‌గన్‌ల మొరాయింపుతో కరువైన నిఘా
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏటికేడు రోడ్లు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నా ఫలితాలు మాత్రం ఆశించిన రీతిలో కనబడటం లేదు. వారమంతా పనిచేసి హాయిగా గడపాల్సిన ఆదివారాలే పలువురి పాలిట కాళరాత్రులవుతున్నాయి. ఈ ఏడాది ఆదివారాల్లో జరిగిన ప్రమాదాలే ఇందుకు నిదర్శనం. ఆదివారాల్లో మృతుల సంఖ్య 176 కాగా...ఆ తర్వాతి స్థానం శుక్రవారంది. ఆ రోజుల్లో మరణాల సంఖ్య 153. ఇందులో ద్విచక్రవాహనాలపై జరుగుతున్న ప్రమాదాలే అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈసారి ప్రమాదాలతో సహా మృతులు, క్షతగాత్రులు ...ఇలా అన్నింటిలో గతేడాదితో పోల్చుకుంటే పెరగడం ఆందోళన కలిగించే అంశమే. ప్రమాదాల సంఖ్య ఏకంగా వందల్లో పెరిగింది. ఈ నేపథ్యంలో ఘటనలు సంభవిస్తున్న తీరు...వాటి నియంత్రణకు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేమిటో చూద్దాం.
మృతుల్లో బైకర్లే ఎక్కువ...
ఈ ఏడాది జరిగిన ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే అధికంగా మరణించారు. అతి వేగం, మద్యం తాగి వాహనం నడపడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాల వల్ల బైకర్లు అధికంగా మరణిస్తున్నారు. మృతుల్లో వీరి సంఖ్య 489 కాగా.. తర్వాతి స్థానం పాదచారులది (461).
ఎక్కువగా సాయంత్రమే...
ప్రమాద మరణాల్లో ఎక్కువగా సాయంత్రమే జరుగుతున్నాయి. అదీ కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలోనే జరుగుతుండటం గమనార్హం. తొందరగా ఇంటికి చేరాలనే ఆత్రం, పగలంతా పనిచేసిన ఒత్తిడి లాంటి కారణాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఘటనల్నీ ప్రతీ మూడు గంటలకోమారు విభజించిన అధికారులు ఈ విషయం తేల్చారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే యాక్సిడెంట్స్ ఎక్కువగా (199) జరుగగా.. రాత్రి 9 నుంచి 12 మధ్య 184 ప్రమాదాలు సంభవించాయి.
హైవేలతోనే బెంబేలు...
అంతర్గత రహదారుల్లో ప్రమాదాలు ఏటా మాదిరిగానే ఈసారీ ఎక్కువే జరిగాయి. వాటిని మినహాయిస్తే జాతీయ రహదారుల్లో విజయవాడ మార్గం మరోసారి ప్రమాదాల్లో అగ్రస్థానంలో నిలిచింది. అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల కంటే విజయవాడ దారిలో అధికంగా 78 ప్రాణాంతక ప్రమాదాలు సంభవించాయి. తర్వాతి స్థానాల్లో 72 ప్రమాదాలతో బెంగళూరు, 70 ప్రమాదాలతో వరంగల్ రోడ్లు నిలిచాయి.
స్లో స్పీడ్‌తో ఇలా...
అవుటర్ రింగ్ రోడ్డుపై గతేడాది జనవరి 18 నుంచి స్లో స్పీడ్ నిబంధనలు అమల్లోకి తెచ్చారు. అధిక వేగంతో వచ్చే భారీ వాహనాలు, తక్కువ వేగంతో వచ్చే ఇతర వాహనాలను ఢీకొడుతుండటంతో ప్రమాదాలు అధికమవుతున్నాయని భావించి దీనిని తెరపైకి తెచ్చారు. ఒక్కోవైపు రహదారిని నాలుగు వరసల చొప్పున విభజించారు. రెండు వరుసలకు 40-80 కి.మీలకు, మరో రెండు వరుసలకు 80-120 కి.మీల చొప్పున వేగపరిమితిని విధించారు. రహదారిపై 40 కి.మీ.కంటే తక్కువ వేగంతో వెళితే జరిమానా విధిస్తారు. లేజర్ స్పీడ్ గన్‌లతో వేగ పరిమితిని అంచనా వేస్తూ జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఈ గన్‌లు అప్పుడప్పుడు మొరాయిస్తుండటంతో వాహనచోదకుల స్పీడ్‌కు నియంత్రణ కరవై ఈ ఏడాది ప్రమాదాలు కాస్త పెరిగాయనే ఆరోపణలున్నాయి. నాలుగు వాహనాలతో ఓఆర్‌ఆర్ పెట్రోలింగ్‌తో గస్తీ నిర్వహిస్తూ అధికారులు ట్రాఫిక్ ఉల్లంఘనుల పని పడుతున్నారు. హైవేస్‌ల్లో 536 ప్రమాదాలు జరుగగా... అంతర్గత రహదారుల్లో 620 జరిగాయి.