'ఈత సరదా ఇన్ఫోసిస్ ఉద్యోగి ప్రాణం తీసింది'
బషీరాబాద్: ఈత సరదా ఓ ఇన్ఫోసిస్ ఉద్యోగి ప్రాణం తీసింది. బంధువులతో కలిసి కాగ్నా నదిలో దిగిన అతడు నీటమునిగి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డిజిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన షాబుద్దీన్, జకీయాబేగం దంపతులు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరి చిన్న కుమారుడు మహ్మద్ యూసుఫ్‌ఖాన్(26) ఇంజినీరింగ్ పూర్తి చేసి ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. బషీరాబాద్‌లో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో యూసూఫ్‌ఖాన్ కుటుంబసభ్యులతో కలిసి వచ్చాడు.
ఆదివారం అతడు బంధువులు, స్నేహితులతో కలిసి నవాంద్గి సమీపంలో ఉన్న కాగ్నానదిలోకి ఈతకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో యూసుఫ్‌ఖాన్ నీటిలో మునిగి పోయాడు. స్నేహితులు, బంధువులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికుల సాయం తో నదిలో గాలించగా సాయంత్రం 5 గంటలకు యూసుఫ్‌ఖాన్ మృతదేహం లభ్యమైంది. చేతికి అందివచ్చిన కొడుకు నదిలో మునిగి చనిపోవడంతో షాబుద్దీన్, జకీయాబేగం దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడు అవివాహితుడు. కాగా, యూసుఫ్‌ఖాన్ మృతిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు.