ఇన్‌పుట్ సబ్సిడీ ఇంకెన్నాళ్లు?
కరువు ప్రకటించి ఆర్నెల్లు... కేంద్రం నిధులిచ్చి రెణ్నెల్లు
- ఖరీఫ్ ముంచుకొస్తున్నా అందని సాయం
- 20 లక్షల మంది రైతుల ఎదురుచూపులు
- ఖజానాలో మూలుగుతోన్న రూ.820 కోట్ల కేంద్ర నిధులు
- రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.198 కోట్లు ఇవ్వకపోవడమే జాప్యానికి కారణం
సాక్షి, హైదరాబాద్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందాన ఉంది రాష్ట్ర సర్కారు తీరు! తీవ్ర కరువులో చిక్కుకున్న తెలంగాణకు కేంద్రం కరువు సాయంగా రెండు నెలల కిందట రూ.712 కోట్లు విడుదల చేసింది. అలాగే రాష్ట్ర విపత్తు నిధికి రూ.108 కోట్లు ఇచ్చింది. మొత్తంగా రూ.820 కోట్లు విడుదల చేసింది. అయినా రాష్ట్ర సర్కారు ఇప్పటివరకు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఒక్క పైసా పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆరు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం 231 మండలాలను కరువుగా ప్రకటించి, కేంద్రాన్ని రూ.3 వేల కోట్ల సాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. మరో మూడ్రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇంకా అందకపోవడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు రైతులు మళ్లీ ప్రైవేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1,018 కోట్లు..
గత ఏడాది ఖరీఫ్‌లో మొత్తం సాధారణ పంటల సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా... 88.82 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో కరువు దెబ్బకు 30.58 లక్షల ఎకరాలకు తీవ్ర నష్టం జరిగిందని కరువు నివేదికలో సర్కారు పేర్కొంది. కరువుతో మొత్తం 20.91 లక్షల మంది రైతులు నష్టపోగా.. అందులో పత్తి రైతులే 9.33 లక్షల మంది ఉన్నారు. దీంతో వ్యవసాయానికి రూ.989 కోట్లు, ఉద్యాన రైతులకు రూ.29 కోట్లు (మొత్తం రూ.1,018 కోట్లు) ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం విడుదల చేసిన రూ.820 కోట్లు ప్రభుత్వ ఖజానాలోనే మూలుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.198 కోట్లు కలిపి రూ.1,018 కోట్లు ఇవ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర వాటా విడుదల చేయనందునే..
కేంద్రం ఇచ్చిన కరువు సాయానికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.198 కోట్లు విడుదల చేయకపోవడం వల్లే ఇన్‌పుట్ సబ్సిడీ పంపిణీ ఆలస్యమవుతోందని అధికారులు అంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధుల వరకే పంపిణీ చేయాలన్నా... ఆ సొమ్ము పూర్తిగా సరిపోదు కాబట్టి జాప్యం చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు తాము మొదట్లో విన్నవించిన రూ.3 వేల కోట్ల కరువు సాయాన్ని పూర్తిగా విడుదల చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరుతోంది. ఈ మేరకు సీఎం స్వయంగా కేంద్రానికి విన్నవించారు. అయితే ఇచ్చిన నిధులు రైతులకు ఇవ్వకుండా అదనపు నిధులు కోరడంతో రాష్ట్ర అధికారులపై కేంద్ర అధికారులు సీరియస్ అయినట్లు తెలిసింది.