‘డీఎస్సీ–2008’పై విచారణ అనవసరం | Inquiry unnecessary on the "DSC -2008 ' | Sakshi
Sakshi News home page

‘డీఎస్సీ–2008’పై విచారణ అనవసరం

Published Sat, Feb 11 2017 3:45 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

‘డీఎస్సీ–2008’పై విచారణ అనవసరం - Sakshi

‘డీఎస్సీ–2008’పై విచారణ అనవసరం

  • ఆ పోస్టుల భర్తీ సబబేనంటూ హైకోర్టు తీర్పు
  • 30 శాతం రిజర్వు నిబంధన అమలు చేయలేదన్న ప్రభుత్వం
  • సాక్షి, హైదరాబాద్‌: డీఎస్సీ–2008 ఎస్జీటీ పోస్టుల భర్తీ వివాదం ఎట్టకేలకు ముగిసింది. డీఈడీ వారికి 30 శాతం పోస్టులు రిజర్వు చేయాల్సిన నిబంధనను అమలు చేయ కుండానే ఆ పోస్టులను భర్తీ చేసినందున.. ఈ వ్యవహారం పై తదుపరి విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల దానికి సంబంధించిన వ్యాజ్యాలన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలిపింది. తద్వారా 2008 డీఎస్సీ ద్వారా భర్తీ చేసిన పోస్టులన్నింటినీ క్రమబద్ధీకరించినట్లేనని చెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్‌ నక్కా బాలయోగిలతో కూడిన ధర్మాసనం రెండు రోజుల క్రితం తీర్పు వెలువరించింది.

    ఆ నిబంధన అమలు చేయలేదు..
    2008 డీఎస్సీ ద్వారా ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసే సమయంలో డీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులకు 30 శాతం పోస్టులను రిజర్వు చేస్తూ ప్రభుత్వం నిబంధన తీసుకొచ్చింది. అయితే నియామక ప్రక్రియ ప్రారంభమైన తరువాత ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చిందని, అది సరికాదంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం.. సదరు నిబంధనతో సంబంధం లేకుండా పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని, అయితే నియామకాలన్నీ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని 2009లో మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

    ఆ ఉత్తర్వులపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ఉత్తర్వులనే సమర్థించింది. మొత్తంగా ఈ అంశంపై సుదీర్ఘ విచారణ జరిపిన ధర్మాసనం తాజాగా మరోసారి విచారించి, తీర్పు వెలువరించింది. విచారణలో ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం 30 శాతం పోస్టుల రిజర్వు నిబంధనను అమలు చేయకుండానే ఎస్జీటీ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేశామని వివరించారు. దానిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. అలాగైతే ఈ వ్యాజ్యాల్లో తదుపరి విచారణ జరపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement